యలమంచిలి రూరల్ : దొంగనోట్ల చలామణీ వ్యవహారం బెడిసికొట్టడం, అత్యాశకు పోవడం వల్ల పట్టణానికి చెందిన ఒక వ్యాపారి తూర్పు గోదావరి జిల్లాలో హత్యకు గురైన సంఘటన తీవ్ర కలకలం రేపింది. 10రోజులైనా వ్యాపారి మృతదేహం లభించకపోవడంతో రెండు జిల్లాల పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. యలమంచిలిలో కర్రి వర ప్రకాష్‌రావు (49) అనే వ్యాపారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 18న హత్యకు గురైన సంఘటనలో దొంగనోట్ల వ్యవహారమే కీలకంగా మారిందని రెండు జిల్లాల పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. విశ్వసనీయ వర్గాల నుంచి సేకరించిన,యలమంచిలి పట్టణ ఎస్‌ఐ కె.సావిత్రి అందించిన సమాచారం ప్రకారం... వివరాలివి. యలమంచిలి పాత ఎస్‌బీఐ కాలనీలో నివాసం ఉంటున్న కర్రి వర ప్రకాశరావు (49) పాతకార్లు, ఇతరత్రా వ్యాపారం సాగిస్తుంటాడు. ఈ నెల 20న వ్యాపారి భార్య సత్య తన భర్త కనిపించడం లేదని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పోలీసుల దర్యాప్తులో వ్యాపారి హత్యోదంతం వెలుగు చూసింది. ఈ నెల 16న తనతో పాటు మరో ఇద్దరితో ప్రకాష్‌రావు సామర్లకోట రైల్వేస్టేషన్‌కు చే రుకున్నారు. అక్కడకు అమలాపురం పట్టణం శ్రీరాంపురం ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి, ముమ్మిడివరం మండలం మహిపాల చెరువుకు చెందిన ఆటోడ్రైవర్‌లతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 1:4 నిష్పత్తిలో దొంగనోట్లు ఇస్తామని చెప్పారు. అమలాపురానికి చెందిన వ్యాపారి నుంచి రూ.10 లక్షలు తీసుకుని ప్రకాష్ వెనుక వచ్చిన ఇద్దరు వ్యక్తులు కన్ను కప్పి పరారయ్యారు. దీంతో వారికి దొరికి పోయిన వర ప్రకాశ్ తన జీవితాన్ని పణంగా పెట్టాల్సివచ్చింది. రూ.10 లక్షలు తీసుకుని ప్రకాష్ వెనుక వచ్చిన ఇద్దరు వ్యక్తులు పారిపోవడంతో వ్యాపారి, ఆటోడ్రైవర్ కలిసి ప్రకాష్‌ను కారులో ఎక్కించుకుని అమలాపురం తీసు కొచ్చారు. పాశర్లపూడి బ్రిడ్జి కిందికి తీసుకెళ్లి హత్య చేశారు. మృతదేహాన్ని ధవళేశ్వర్వం బ్రిడ్జి మీద నుంచి గోదావరి నదిలోకి పడేసి నిందితులు పరారయ్యారు. ఈనెల 18వ తేదీ తెల్లవారు జామున వారు ఆ మృతదేహాన్ని గోదావరిలో పడేసినట్టు యలమంచిలి పోలీసులు తమ విచారణలో గుర్తించారు. ఇప్పటి వరకూ మృతదేహం దొరకలేదు.
పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు
అమలాపురం టౌన్ : కిడ్నాప్‌నకు గురైన అనకాపల్లి జిల్లా యలమంచిలికి చెందిన కర్రి వర ప్రకాష్‌ది హత్యేనని అక్కడి సీఐ ధనుంజయ్ ఆదివారం వెల్లడించారు. దర్యాప్తు నిమిత్తం అమలాపురం వచ్చిన ఆయన మాట్లాడుతూ కోనసీమ జిల్లా అమలాపురం శ్రీరామపురం సెంటర్‌లో షణ్ముఖ సాయి జనరల్ స్టోర్స్ నిర్వహిస్తున్న వ్యాపారి కేదారశెట్టి నాగ విజయ్ గణేష్ ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు కాగా, రెండో నిందితుడు ముమ్మిడివరం మండలం మహిపాలచెరువు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రామాంజనేయులని ఆయన తెలిపారు. దొంగనోట్ల మార్పిడిలో జరిగిన మోసమే ప్రకాష్ హత్యకు దారి తీసినట్టు తెలిపారు. ఇక్కడి వ్యాపారి నాగ విజయ్ గణేష్ ఇంటికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకుని వరప్రకాష్‌ను హత్య చేసిన అల్లవరం మండలం గోడిలంక శ్మశానానికి వెళ్లి దర్యాప్తు చేశారు రెండో నిందితుడు రామాంజనేయులు పరారీలో ఉన్నట్టు ఆయన తెలిపారు.
గుట్టుచప్పుడు గాకుండాదొంగనోట్ల చలామణీ
ఈ వ్యవహారంలోనే యలమంచిలి వ్యాపారి హత్య
10 రోజులైనా దొరకని మృతదేహం
పట్టణంలో కలకలం


