● నేడు అంకురార్పణ
● 23 వరకు ఉత్సవాలు
● మొదటి రోజు ఉత్సవ కావడి ఊరేగింపు
● ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ
నక్కపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపమాకలో గరుడాద్రిపై కల్కి అవతారంలో స్వయం వ్యక్తమై వెలసిన స్వామివారికి ప్రతిఏటా బ్రహ్మోత్సవాలు తిరుపతిలో మాదిరిగానే పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారం నిర్వహిస్తారు. భాద్రపద చవితి (ఈ నెల 14) నుంచి భాద్రపద ద్వాదశి (23వ తేదీ) వరకు పదిరోజుల పాటు ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతాయి. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలకు వెళ్లలేని వారు ఉపమాక వచ్చి స్వామివారిని దర్శించుకుని ఉత్సవాలను తిలకిస్తారు.
కావడి ఉత్సవంతో ఆహ్వానం
ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం స్వామివారి ఉత్సవ కావడిని ఉపమాక వీధుల్లో ఊరేగిస్తారు. భక్తులు పసుపు, కుంకుమలు, కొబ్బరి బొండాలు సమర్పిస్తారు. స్వామివారి ఉత్సవాలకు ఆహ్వానించేందుకు ఉత్సవ కావడిని ఊరేగిస్తామని ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు తెలిపారు. సోమవారం రాత్రి 7.30 గంటలకు ఉత్సవాలకు సంబంధించిన అంకురార్పణ జరుగుతుంది. స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం పూర్తి చేసిన తర్వాత విష్వక్సేనుల వారిని పల్లకిలో ఉంచి మత్స్యగ్రహణం, పుట్టమన్ను తెచ్చే కార్యక్రమం నిర్వహిస్తారు. రాత్రి అశ్వవాహనంపై స్వామివారి తిరువీధి సేవ జరుగుతుంది.
● 15వ తేదీ మంగళవారం ఉదయం స్వామివారి ఆలయంలో ధ్వజారోహణ నిర్వహిస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు అష్టదిక్పాలకులను ఆహ్వానిస్తూ ధ్వజపటాన్ని ఎగురవేస్తారు. రాత్రికి శేషతల్ప వాహనంపై స్వామివారి తిరువీధి సేవ జరుగుతుంది.
● 16 వ తేదీ బుధవారం ఉదయం ఆలయంలో నిత్యపూజలు, అభిషేకాలు, ఉత్సవ పూజల అనంతరం ఉదయం రాజాదిరాజ వాహనం, రాత్రికి హంసవాహనంపై తిరువీధి సేవ నిర్వహిస్తారు.
● 17వ తేదీ గురువారం ఉదయం నిత్యపూజల అనంతరం ఇత్తడి సప్పరం వాహనంపై, రాత్రి పెద్దపల్లకిలో స్వామివారి ఉత్సవమూర్తులను ఉంచి తిరువీధి సేవ జరుగుతుంది.
● 18వ తేదీ శుక్రవారం ఉదయం ఆలయంలో పూజల అనంతరం ఆంజనేయ వాహనంపైన, రాత్రి గరుడ వాహనంపైన తిరువీధి సేవలు జరుగుతాయి.
● 19వ తేదీ శనివారం ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకాలు, నిత్యపూజల అనంతరం సప్పరం వాహనంపైన, రాత్రి రాజాదిరాజ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామిని ఉంచి తిరువీధి సేవ నిర్వహిస్తారు.
● 20న వసంతోత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా సాయంత్రం ఆస్థాన మండపంలో స్వామివారిని ఉంచి విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం పూర్తిచేసి ఉత్సవమూర్తులను ఇత్తడి గరుడ వాహనంపై ఉంచి భక్తులంతా వసంతాన్ని ఒకరిపై ఒకరు జల్లుకునే కార్యక్రమం నిర్వహిస్తారు.
● 21వ తేదీ ఉదయం పూజల అనంతరం రథోత్సవంలో భాగంగా సాయంత్రం పుణ్యకోటి వాహనంపై తిరువీధి సేవలు నిర్వహిస్తారు.
● 22న మృగవేట కార్యక్రమం జరుగుతుంది. దీనిలో భాగంగా ఉదయం విశేష హోమాలు, చిన్నపల్లకి సేవ పూర్తిచేసి సాయంత్రం గజవాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఉంచి బంధుర సరస్సు వద్దకు తీసుకువస్తారు. ఉత్సవమూర్తులకు, ధనుర్భాణాలకు పూజలు చేసిన పిదప గజవాహనంపై స్వామివారికి తిరువీధి సేవ నిర్వహిస్తారు.
● 23న ఆలయంలో నిత్యసేవాకాలం, హోమాలు, పూజలు జరుగుతాయి. ఉదయం కార్యక్రమాల్లో భాగంగా వినోదోత్సవం నుంచి వచ్చిన స్వామివారు గర్భాలయంలోకి ప్రవేశించడాన్ని ఉభయ దేవేరులు అడ్డుకుంటారు. దీన్ని లక్ష్మీసంవాదంగా పిలుస్తారు. తాను ఎవరో చెప్పిన తర్వాత అమ్మవారు స్వామివారిని గర్భాలయ ప్రవేశానికి అనుమతిస్తారు. ఈ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత విష్వక్సేనుడు, సుదర్శన పెరుమాళ్లకు పూజలు, హోమాలు నిర్వహించి గ్రామ బలివిసర్జనలు, కంకణ విసర్జన, ధ్వజ అవరోహణ వంటి కార్యక్రమాలు పూర్తి చేస్తారు. దీంతో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తయినట్లేనని ప్రసాదాచార్యులు తెలిపారు.


