● పెద్ద ఎత్తున పూజా సామగ్రి,
విగ్రహాల కొనుగోలు
● కిటకిటలాడిన ప్రధాన రోడ్లు
● భారీగా తరలివచ్చిన భక్తజనం
సాక్షి నెట్‌వర్క్ : వినాయక చవితి పండగ పురస్కరించుకుని ఆదివారం జిల్లాలోని పలు మార్కెట్లలో సందడి నెలకొంది. పండగ సామగ్రి కొనుగోళ్లతో అన్ని మండలాల్లోనూ మార్కెట్లు రద్దీగా మారాయి. అనకాపల్లి, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం తదితర ప్రాంతాల్లో మార్కెట్లకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆయా ప్రాంతాలు ఉదయం నుంచి సాయంత్రం జనసందోహంతో కిక్కిరిసిపోయాయి. పత్రితో పాటు పూజా సామగ్రి, కిరాణా, ఇతర నిత్యావసరాలను భక్తులు కొనుగోలు చేశారు. దుకాణాల వద్ద వాహనాలను నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్యతోపాటు రోడ్లన్నీ రద్దీగా మారాయి. పండ్లు, పూలు, కొబ్బరికాయల ధరలు ఆకాశాన్నంటడంతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మూడు చిన్న సైజు యాపిల్ పండ్ల ధర రూ.100 వరకు పలకగా, మిగిలిన పండ్ల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. బంతి, చామంతి, గులాబీ పూల ధరలు భారీగా పెరిగాయి. పెద్ద సైజు గణపతి విగ్రహాలను కొనుగోలు చేసి తీసుకువెళ్లారు.
పూజా సామగ్రి కొనుగోలుకు వచ్చిన జనంతో రద్దీగా నర్సీపట్నం అబిద్‌సెంటర్


