● వేడుకలకు సిద్ధమైన దత్తక్షేత్రం
● 18 మొక్కలతో సస్య గణపతి ఏర్పాటు
అనకాపల్లి: జాతీయ రహదారిలో తాడి రైల్వే స్టేషన్ సమీపంలో సిరసపల్లిలో వెలసిన చింతామణి గణపతి దత్తక్షేత్రం నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. చింతలు తీర్చే చింతామణి గణపతి ఆలయాలు మనకు ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా కనిపిస్తాయి. చింతామణి గణపతి మొదట ఉజ్జయిని నగరంలో స్వయంభువుగా వెలిశారు. తర్వాత కాశీనగరంలో దేవరాజైన ఇంద్రుడు చింతామణి గణపతిని ప్రతిష్ఠ చేసి పూజించారు. దేశంలోనే అతిపెద్ద చింతామణి గణపతి ఆలయంగా అనకాపల్లి మండలం జీవీఎంసీ విలీన గ్రామైన సిరసపల్లి ఆలయం ప్రసిద్ధి పొందింది. దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ 2012 జనవరి 25వ తేదీన ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేశారు. 14 సంవత్సరాలుగా చింతామణి గణపతి దత్తక్షేత్రంలో ప్రతి ఏటా వినాయక నవరాత్రులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది సస్య హరిత గణపతి
ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు గణపతి దత్తక్షేత్రంలో 18 వేల మొక్కలతో 20 అడుగుల సస్య హరిత గణపతిని ఏర్పాటు చేసి 21 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేయనున్నారు.
ప్రత్యేక ఏర్పాట్లు చేశాం
దత్తక్షేత్రంలో సస్య హరిత గణపతిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లుచేసినట్టు ఆలయ నిర్వాహకులు ఎం.ఆంజనేయరాజు చెప్పారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. సస్య హరిత గణపతిని రెండు లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని భావిస్తున్నట్టు చెప్పారు.


