అచ్యుతాపురం రూరల్: నునపర్తి గ్రామానికి చెందిన రెడ్డి యశ్వంత్ జాతీయ స్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికై నట్లు జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గొంప నరసింహనాయుడు ఆదివారం తెలిపారు. వచ్చేనెల 3 నుంచి 7 వరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని భిలాయ్‌లో జరగనున్న 45వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ అండర్–16 బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో యశ్వంత్ పాల్గోనున్నట్లు నరసింహనాయుడు తెలిపారు. ఇటీవల ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన 11వ రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో విశాఖపట్నం జిల్లా తరఫున యశ్వంత్ ప్రాతినిధ్యం వహించాడు. ఆ పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.యశ్వంత్‌ను జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పెదపూడి శంకరరావు, శ్రీరామ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ ఆర్.వి.వి. నగేష్, అధ్యక్షుడు మాసవరపు అప్పారావు, కార్యదర్శి అప్పలరాజు, గ్రామస్తులు అభినందించారు.
నేటి పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ రద్దు
తుమ్మపాల: కలెక్టరేట్‌లో ప్రతి వారం నిర్వహించే పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను ఈ సోమవారం (14వ తేదీ) రద్దు చేసినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో ఈ కార్యక్రమాలను రద్దు చేసినట్టు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆమె కోరారు.


