రావికమతం : చీమలపాడు పంచాయితీ జెడ్.జోగుంపేటలో పోలింగ్ ఏర్పాటు చేయాలని ఆదివారం గిరిజనులు డోలీ కట్టి విన్నూతంగా నిరసనలు తెలిపారు. చీమలపాడు పంచాయితీ పరిదిలో జెడ్.జోగుంపేట, బంగారు బందలు, జీలుగులోవ, కడగడ్డ ఆజేయపురం, గంగంపేట, తాటిపర్తి, పెద్దగరువు, రోచ్చుపణుకు, రాయపాడు గ్రామాల్లో 720 మంది ఓటర్లు ఉన్నారు. అయితే వీరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సుమారు 10 కిలోమీటర్లు దూరంలో ఉన్న చీమలపాడు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి. 10 కిలోమీటర్లు దూరంలో ఉన్న చీమలపాడు రావాలంటే కళ్యాణపులోవ వరకు గుర్రాలపై, వృద్ధులైతే డోలీ ద్వారా వచ్చి అక్కడ నుంచి ఆటోల ద్వారా, లేదా ఇతర వాహనాలపై వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి. కొన్ని సమయాల్లో పోలింగ్ బూత్ వద్ద ఓటు వేయడం ఆలస్యం అయితే కొండ శిఖర గ్రామాలకు వెళ్లాలి. ఈ పది గ్రామాలకు జెడ్.జోగుంపేటలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని గతంలో డిమాండ్ చేసినా అధికారులు పట్టించుకోలేదని గిరిజనులు వాపోయారు. జెడ్.జోగుంపేటలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తే ఎటువంటి ఇబ్బందులు లేవని, దీనిపై ఈ నెల 16న రావికమతం మండలంలో ఎంపీడీవో కార్యాలయంలో జరిగే అన్ని రాజకీయ పార్టీ నాయకులతో జరిగే సమావేశంలో తెలుపుతామని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి జెడ్.జోగుంపేటలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని గిరిజనులు పాంగి రమేష్, తులసమ్మ, కె.భవానీ, కిలో పిట్టదొర కోరారు.


