కె.కోటపాడు : దండుముత్యాలమ్మ ఆలయం నుండి గరుగుబిల్లి వరకూ గల మట్టిరోడ్డును గ్రావెల్‌రోడ్డుగా నిర్మాణం చేపనున్నట్టు వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి దాట్ల శివాజీరాజు, వైస్ ఎంపీపీ రొంగలి సూర్యనారాయణ అన్నారు. చౌడువాడ–2 సిగ్మెంట్ పరిధిలో గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి జెడ్‌పీటీసీ ఈర్లె అనురాధ రూ.5 లక్షల నిధులను మంజూరు చేశారు. ఈ నిధులతో ఆదివారం గ్రావెల్‌రోడ్డు నిర్మాణానికి భూమిపూజను గ్రామ పెద్దలతో కలిసి శివాజీరాజు, సూర్యనారాయణ జరిపారు. గతంలో దండుముత్యాలమ్మ ఆలయం నుంచి గరుగుబిల్లి వెళ్లే మట్టిరోడ్డుతో ప్రజలు ఇబ్బందులు పడేవారని, ఈ సమస్యను జెడ్‌పీటీసీ దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే ఆమె నిధులను మంజూరు చేశారని సూర్యనారాయణ తెలిపారు. గ్రావెల్‌రోడ్డు నిర్మాణం పూర్తయితే ఈ మార్గంలో ప్రయాణించే ప్రజల రాకపోకల ఇబ్బందులు తీరినట్టేనని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దాడి ఎరుకునాయుడు, వారాధి అప్పారావు, ఆకుల సాయిప్రసాద్, చల్లా సురేష్, యాదవ సంఘం కమిటీ పెద్దలు పాల్గొన్నారు.


