గిరి ప్రదక్షిణకు విస్తృత ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

గిరి ప్రదక్షిణకు విస్తృత ఏర్పాట్లు

Jul 24 2026 1:21 AM | Updated on Jul 24 2026 1:21 AM

మహారాణిపేట: ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన తుది సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున ట్రాఫిక్‌, భద్రత, తాగునీరు, వైద్యం, పారిశుధ్యం, విద్యుత్‌, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గిరి ప్రదక్షిణ మార్గాన్ని 7 జోన్లు, 28 సెక్షన్లుగా విభజించి ప్రతి సెక్షన్‌కు పోలీసు, జీవీఎంసీ అధికారులను ఇన్‌చార్జిలుగా నియమించారు. 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆరు షిఫ్టుల్లో అధికారులు విధులు నిర్వహించనున్నారు. మార్గంలో ఏడు కంట్రోల్‌ రూమ్‌లు, 28 సహాయక కేంద్రాలు, 31 వైద్య శిబిరాలు, 595 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నారు. భక్తుల రద్దీని కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో పర్యవేక్షించడంతో పాటు చిన్నపిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లు అందుబాటులో ఉంచనున్నారు. గిరి ప్రదక్షిణ రోజుల్లో బీఆర్‌టీఎస్‌ రోడ్డుపై వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదని, ప్రత్యామ్నాయ మార్గాలపై విస్తృత ప్రచారం చేపట్టాలని కలెక్టర్‌ సూచించారు. అలాగే మద్యం దుకాణాలను మూసివేయాలని, భక్తుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలని ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఈ నెల 28 ఉదయం నుంచి 29 మధ్యాహ్నం వరకు సింహాచలం వైపు భారీ వాహనాలపై ఆంక్షలు అమలు చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు, దేవస్థానం ఈవో జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement