నక్కపల్లి : రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రైవేటు పరం చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబరు 396ను రద్దు చేయాలని కోరుతూ దస్తావేజు లేఖర్లు నిరసన కొనసాగిస్తున్నారు. గురువారం నక్కపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్ద వంటా వార్పుతో నిరసన చేపట్టారు. వైఎస్సార్‌సీపీ ఈ ఆందోళనకు సంఘీభావం తెలిపింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ మాట్లాడుతూ ఈ విధానం వల్ల ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కొరవడుతుందన్నారు. లావాదేవీలు ప్రైవేటు సంస్థలకు అప్పగించడం తగదన్నారు. రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఆధారపడ్డ వేలాది మంది లేఖర్లు జీవనోపాధి కోల్పోతారన్నారు. వెంటనే ఈ జీవోను ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండలశాఖ అధ్యక్షుడు గొర్ల గోవిందు, మాజీ అధ్యక్షుడు పొడగట్ల పాపారావు, మాజీ సర్పంచ్‌లు తళ్ల భార్గవ్, సాదిరెడ్డి శ్రీను, దస్తావేజు లేఖర్ల సంఘ నాయకులు దాతారం మురళీకృష్ణ, రమణ బాబు, కుమార్ పాల్గొన్నారు.


