జీవీఎంసీకి మాడుగుల ఎమ్మెల్యే బండారు అల్టిమేటం లేకపోతే రైవాడ నుంచి చుక్కనీరైనా ఇవ్వబోమని బెదిరింపులు ఖరీఫ్ సాగుకు 250 క్యూసెక్కుల నీరు విడుదల
దేవరాపల్లి: రైవాడ జలాశయానికి వారం, పది రోజుల్లోగా రూ.5 కోట్లు చెల్లించకుంటే జీవీఎంసీకి నీటి సరఫరాను నిలుపుదల చేస్తామని టీడీపీకి చెందిన మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి జీవీఎంసీ అధికారులను ఉద్దేశించి బెదిరింపులకు దిగారు. రైవాడ జలాశయం నుంచి ఖరీఫ్ పంటల సాగుకు ఎమ్మెల్యే బండారు గురువారం నీటిని విడుదల చేశారు. ముందుగా రైవాడ అతిథి గృహం వద్ద వినాయక, జలాశయం వద్ద ఎరకాలమ్మ తల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఎడమ కాలువ స్లూయిస్ గేటు వద్ద జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా 150 క్యూసెక్కులు, కుడి ప్రధాన కాలువ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తారువ సమీపంలోని కలిగొట్ల బ్రాంచ్ కెనాల్ వద్ద రూ. 27 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక విలేకరులతో మాట్లాడారు. రైవాడ నుంచి నీటి సరఫరా చేస్తున్నందుకు జీవీఎంసీ రూ.169 కోట్ల మేర బకాయి చెల్లించాల్సి ఉందని, రైవాడ జలాశయం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని పలుమార్లు జీవీఎంసీ అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశంలో సైతం ఈ సమస్యను ప్రస్తావించానన్నారు. విశాఖ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ ఇచ్చిన హామీ మేరకు రూ. 5 కోట్లు వారం, పది రోజుల్లో విడుదల చేయాలని, లేకుంటే ఎమ్మెల్యే హోదాలో తానే రైతులతో కలిసి జీవీఎంసీకి చుక్క నీరు వెళ్లకుండా గేట్లు మూసేసి అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైవాడ ప్రాజెక్టు చైర్మన్ పోతల పాత్రునాయుడు, ఇరిగేషన్ డీఈలు జి.సత్యంనాయుడు, వేణుగోపాలనాయుడు పాల్గొన్నారు.


