ప్రభుత్వ ఆధీనంలోనే ఎలక్ట్రికల్‌ బస్సులు నడపాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆధీనంలోనే ఎలక్ట్రికల్‌ బస్సులు నడపాలి

Jul 24 2026 1:21 AM | Updated on Jul 24 2026 1:21 AM

డిపో వద్ద ఏఐటీయూసీ ధర్నా

అనకాపల్లి: కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్రజారవాణాశాఖ(ఆర్టీసీ)లో కేంద్ర సాయంతో ఎలక్ట్రికల్‌ బస్సులను ప్రవేశపెట్టి ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించాలని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం దుర్మార్గమని ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు వై.ఎన్‌.భద్రం అన్నారు. స్థానిక డిపో గేటు వద్ద ఎలక్ట్రికల్‌ బస్సులను ప్రభుత్వ ఆధీనంలో నడపాలని గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోరాడి ప్రాణత్యాగాలు చూసి సాధించుకున్న ఆర్టీసీని వైఎస్సార్‌సీపీ పాలనలో విలీనం చేయడం జరిగిందన్నారు. నేటి పాలనలో ఆర్టీసీని మరోసారి ప్రైవేట్‌ వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు సీఎం చంద్రబాబునాయుడు చర్యలు తీసుకోవడం అన్యాయమన్నారు. ఇప్పటికే రూ.30 కోట్ల విలువైన విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి పట్టణాలలో ఆర్టీసీ ఆిస్తిని పినాకిల్‌ అనే ప్రైవేట్‌ సంస్థకు ధారాదత్తం చేయడం అన్యాయమని, 70 సంవత్సరాలుగా లక్షలాది మంది పేద మధ్యతరగతి ప్రజల ప్రయాణ అవసరాలకు ఉపయోగపడుతున్న ఆర్టీసీని ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు కారు చౌకగా కట్టబెట్టడం మానుకోవాలన్నారు. సూపర్‌ 6లో భాగంగా శ్రీ శక్తి ద్వారా 60 లక్షల మందికి ఉచితంగా సేవలందిస్తున్న ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వమే ఎలక్ట్రికల్‌ బస్సులు కొనుగోలు చేసి, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్‌ తోనే బస్సులను నడిపించాలని, ఆర్టీసీలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, కారుణ్య నియామకాలు జరపాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఆర్టీసీ స్థలాలను కారు చౌకగా ప్రైవేటు కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టడం నిలుపుదల చేయాలని లేని పక్షంలో ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు డి.ఎన్‌.మూర్తి, బి.వి.రామకృష్ణ, తాకాసి వెంకటేశ్వరరావు, శ్రీరామదాసు అబ్బులు, కోరుమిల్లి శంకరరావు, కర్ణం మాణిక్యాలరావు, వేపాడ శ్రీను, కె.ఎం రావు, సురేష్‌, బి.ఎస్‌ రావు, మత్తుర్తి సూరిబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement