సబ్బవరం: రాష్ట్ర స్థాయిలో ఈ నెల 21 నుంచి 23 వరకూ విజయవాడలో నిర్వహించిన పారా స్పోర్ట్స్ మీట్‌లో మండలంలోని తవ్వవానిపాలెం జెడ్పీ హైస్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి సీరంరెడ్డి పూర్ణతేజ నాలుగు పతకాలు సాధించాడు. రిలే రన్నింగ్, లాంగ్ జంప్ విభాగాల్లో స్వర్ణ పతకాలు, 400 మీటర్ల పరుగులో రజతం, 100 మీటర్ల పరుగులో కాంస్య పతకం అందుకున్నాడు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరచడంతో అక్టోబర్‌లో ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా పూర్ణతేజను ఎంఈవోలు లక్ష్మణరావు, రవీంద్రబాబు, పాఠశాల హెచ్‌ఎం ఏవీఎన్ రత్నం, గ్రామ పెద్దలు బోకం స్వామినాయుడు, ఉపాధ్యాయులు అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


