ప్రజల బలహీనతతో ఆడుకున్న కూటమి ఎంపీ సీఎం రమేష్
ప్రత్యేక రైలులో కాశీ, అయోధ్యలకు 1600 మంది ఉచిత టూర్
ఇదే సమయంలో పవిత్ర పంచదార్ల కొండను కొల్లగొట్టి రూ.కోట్లు ఆర్జన
స్వామివారి ధర్మధారలు కన్నీరు పెడుతున్నాయని భక్తుల ఆగ్రహం
సాక్షి, అనకాపల్లి: ఒకవైపు పవిత్ర పుణ్యక్షేత్రమైన పంచదార్ల కొండలను పిండి చేస్తూ రూ.వందల కోట్ల అక్రమార్జనకు తెగబడటం..మరోవైపు ప్రజల ఆధ్యాత్మిక బలహీనతను ఆసరాగా చేసుకుని ‘ఉచిత ఆయోధ్య, కాశీ యాత్రలు’ పేరిట ప్రజల దృష్టిని మళ్లించడం..ఇదీ కూటమికి చెందిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తీరు. భక్తి పేరుతో ప్రజలను మభ్యపెడుతూ, పవిత్ర దైవక్షేత్రాల కొండలను తన బినామీలతో కొల్లగొడుతున్న వైనం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పంచదార్ల కొండపై స్థానిక బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పీఏ విజయ్‌కుమార్ నాయుడు, లక్ష్మీ మినరల్స్ పేరిట, స్థానిక జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ అనుచరుడు వై. శ్రీనివాస్ పేర్లతో అక్రమ తవ్వకాలకు తెరలేపారు. వీటికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఉద్యమం తలపెట్టింది. దీనికి ప్రజల నుంచి భారీ మద్దతు లభించింది. తమ పాలనపై ప్రజావ్యతిరేకత తలెత్తడంతో కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలి‘ట్రిక్స్’ ఉపయోగిస్తోంది. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుంచి రెండు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశారు. ఇదే సమయంలో 19వ తేదీ నుంచి అయోధ్య యాత్రకు రైలు వెళుతున్నట్టు కూటమి నేతలు ప్రకటించారు. తిరుగు ప్రయాణంలో 23వ తేదీన అనకాపల్లి చేరుకుంది. మళ్లీ మూడు నాలుగు ట్రిప్‌లు యాత్రకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
దోపిడీ నుంచి దృష్టి మళ్లించేందుకే...
జిల్లాలో ఆధ్యాత్మిక కొండల్లో అక్రమ మైనింగ్‌ను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఉద్యమబాట పట్టింది. ఇటీవల రెండు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు, ఈ నెల 21న ‘ఛలో పంచదార్ల’ కార్యక్రమాలు చేపట్టింది. వైఎస్సార్‌సీపీ చేపట్టిన పోరాటానికి భయపడిన అధికార యంత్రాంగం తాత్కాలికంగా తవ్వకాలను నిలిపివేసింది. అయితే, ఈ దోపిడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కూటమి నాయకులు కుట్ర పన్నారు. వైఎస్సార్‌సీపీ దీక్షలు చేపట్టిన రోజే అనకాపల్లి జిల్లాకు చెందిన 1,,600 మందిని ప్రత్యేక రైలులో కాశీ, అయోధ్య ఉచిత యాత్రకు తీసుకెళ్లారు. గురువారంతో ఈ యాత్ర ముగిసి రైలు తిరిగి అనకాపల్లికి చేరుకుంది. కొండలను కొల్లగొట్టి ఆర్జించిన అక్రమ సొమ్ముతోనే ఈ యాత్రలు చేయిస్తున్నారని, భక్తి పేరుతో జిల్లా ప్రజలను నిద్రపుచ్చే యత్నం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ స్పష్టం చేసింది. తాజాగా పంచదార్ల, వెంకటాపురం, హరిపురం, రాంబిల్లి పరిసర గ్రామాల నుంచి మరో 1,600 మందిని యాత్రకు తీసుకెళ్లేందుకు ఎంపీ వర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
శివాగ్రహం తప్పదు!
ఉమా ధర్మలింగేశ్వరస్వామి, మాధవస్వామి ఆలయాలు, లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాలు ఉన్న ఫణిగిరి కొండ గుండెల్లోంచి ఉద్భవించి భక్తులకు పుణ్యతీర్థాన్ని అందించే ఆ ఐదు పవిత్ర ధారలు ఇప్పుడు కన్నీరు పెడుతున్నాయి. అభివద్ధి ముసుగులో ఎంపీ కనుసన్నల్లో పవిత్ర జలాలను దారి మళ్లించి, పవిత్రతను దెబ్బతీసిన వారికి శివాగ్రహం తప్పదని సమీప గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. అక్రమ మైనింగ్‌తో చేసిన పాపాలు కాశీ, అయోధ్య యాత్రతో పోవని, పంచదార్ల క్షేత్ర పవిత్రతను కాపాడుకునే వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధర్మపోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు.


