సబ్సిడీ పరికరాల ఎంపికలో తీవ్ర జాప్యం
కార్యాలయాల చుట్టూ అన్నదాతల ప్రదక్షిణలు జిల్లాలో 1,919 మంది దరఖాస్తు.. కేటాయించిన నిధులు రూ. 2.66 కోట్లు ట్రాక్టర్, అనుబంధ యంత్ర పరికరాలకు భారీ డిమాండ్
సాక్షి, అనకాపల్లి: వ్యవసాయ యంత్ర పరికరాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దరఖాస్తుల స్వీకరణ పూర్తయి నెల దాటినా ఎంపిక ఒక కొలిక్కిరాలేదు. జిల్లాలో ఖరీఫ్ ప్రారంభమైనా..చంద్రబాబు ప్రభుత్వంలో చలనం లేదు. మే నెల 5 నుంచి 15వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించారు. మే నెల 23 నుంచి 25 వ తేదీల్లోగా లాటరీ ప్రక్రియ ద్వారా రైతులను ఎంపిక చేయాలి. జూన్ 26 లోపు సరఫరా చేయాలి. జూన్ 30న సబ్సిడీ విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఎంపిక ప్రక్రియే జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత తొలి ఏడాది యంత్రపరికరాలను అందజేయకుండా ఎగవేసింది. ఈ ఏడాదైనా పరికరాలు రాయితీపై అందచేస్తారని ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు. దరఖాస్తు చేసి, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. రైతుల సమక్షంలోనే జాయింట్ కలెక్టర్ లేదా జేడీ ఆధ్వర్యంలో లాటరీ ద్వారా అర్హులను ఎంపిక చేయాల్సి ఉంది.
నత్తనడక
అన్నదాతలకు చేయూత కల్పించే విధంగా గత ప్రభుత్వ హయాంలో శ్రీకారం చుట్టిన యంత్ర సేవా పథకం ..పేరు మార్చి కూటమి ప్రభుత్వంలో కూడా కొనసాగిస్తున్నా.. సక్రమంగా అమలు చేయడం లేదు. ఈ ఏడాదైనా పూర్తిస్థాయి పరికరాలు ఇస్తారనే ఆశతో ఉన్న రైతులకు నిరాశే మిగిలింది. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం కారణంగా రైతులకు రాయితీపై యంత్ర పరికరాలను అందజేసే ప్రక్రియ ముందుకెళ్లడం లేదు.
2.9 లక్షల మంది రైతులు.. 2.66 కోట్ల నిధులు
జిల్లాలో ఈ–పంట నమోదు ప్రకారం సుమారు 2.9 లక్షల మంది రైతులు పంటలు సాగు చేస్తున్నారు. వీరికి అందించే యంత్రాల ధరలు, నాణ్యతా ప్రమాణాలు, తయారీదారులను ప్రభుత్వం ముందే ఖరారు చేసింది. కేంద్రానికి చెల్లించే జీఎస్టీని సైతం 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడంతో పాటు, అగ్రోస్ సంస్థ భాగస్వామ్యం కమీషన్ రూపంలో మరో 4 శాతం భారాన్ని తగ్గించింది. ఇంతవరకు ముందస్తు ప్రణాళికతో అడుగులు వేసి, జిల్లాకు రూ. 2.66 కోట్ల నిధులను వ్యవసాయశాఖకు కేటాయించారు. నిబంధనల ప్రకారం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్య ంలోని కమిటీ.. దరఖాస్తు చేసుకున్న రైతుల సమక్షంలో లాటరీ ద్వారా అర్హులను ఎంపిక చేయాల్సి ఉంది.
ట్రాక్టర్లకు భారీ డిమాండ్
జిల్లావ్యాప్తంగా యంత్రాల కోసం 1,919 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అత్యధిక శాతం మంది ట్రాక్టర్లు, టార్పాలిన్లు కోరుతున్నారు. ట్రాక్టర్లకు భారీ డిమాండ్ ఉంది. వారం రోజుల్లోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ లాటరీ విధానంలో జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అధికారులు పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ చేయాలని రైతులు కోరుతున్నారు . రైతు గ్రూపులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను ప్రభుత్వం అందిస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు చెందిన చిన్న, సన్నకారు రైతులు, మహిళలకు 50 శాతం సబ్సిడీపై యంత్రాలు అందజేస్తున్నారు. ఇతర బీసీ, ఓసీ వర్గాలకు చెందిన రైతులకు 40 శాతం సబ్సిడీపై వ్యవసాయ సాగు యంత్ర పరికరాలు మంజూరు చేస్తున్నా రు. కనీసం 10 మంది రైతులు కలిసి కస్టమ్ హైరింగ్ సెంటర్ గ్రూపుగా ఏర్పడాలి. అర్హులైన రైతు గ్రూపులు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, భూమి పాస్‌బుక్, బ్యాంక్ ఖాతా వివరాలతో తమ పరిధిలోని రైతు భరోసా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. లేదా అధికారిక అగ్రి మెషినరీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ సబ్సిడీ సొమ్ము నేరుగా రైతు గ్రూపుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది.
నిధుల కేటాయింపు ఇలా..


