● 16 నుంచి రథయాత్ర ఉత్సవాలు
● 25న మారు యాత్ర
అనకాపల్లి టౌన్: స్థానిక గూడ్స్‌రోడ్డు వద్ద ఉన్న ఇంద్రద్యుమ్న హాల్‌లో జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవాలు ఈ నెల 16 నుంచి 25 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.16వ తేదీన జరగనున్న తొలి రథయాత్ర కోసం రథాన్ని, ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అర్చనలు, భజనలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
తొలి రథయాత్ర ఇలా...
16వ తేదీన గవరపాలెం అగ్గిమర్రి చెట్టు జగన్నాథస్వామి ఆలయం వద్ద నుంచి ప్రారంభమై చింతావారి వీధి, గాంధీబొమ్మ జంక్షన్, మళ్ళ వీఽధి మీదుగా గూడ్స్‌షెడ్ వద్ద ఉన్న ఇంద్రద్యుమ్న హాల్ వరకు రథయాత్ర సాగుతుంది.
తిరుగు రథయాత్ర
25వ తేదీన ఇంద్రద్యుమ్నహాల్ నుంచి ప్రారంభమై మళ్లవీధి, గాంధీ బొమ్మ జంక్షన్, చిననాలుగు రోడ్ల జంక్షన్ మీదుగా మెయిన్ రోడ్డు, వేల్పుల వీధి, పెద్ద నాలుగు రోడ్ల జంక్షన్ మీదుగా టౌన్ పోలీస్‌స్టేషన్ వరకూ చేరుకుని మళ్లీ చిన నాలుగు రోడ్ల జంక్షన్, వన్‌వే ట్రాఫిక్ జంక్షన్ మీదుగా గవరపాలెం అగ్గిమర్రి చెట్టు వద్ద ఉన్న జగన్నాథస్వామి ఆలయం వరకు సాగుతుంది.
దశావతారాలు ..
ఈ పది రోజులు దశావతారాల్లో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 16న మత్స్యా వతారం, 17న కూర్మావతారం 18న వరాహావతారం, 19న నారసింహావతారం, 20న వామనావతారం, 21న పరశురామావతారం, 22న రామావతారం , 23న కృష్ణావతారం, 24న బుద్ధావతారం, 25న కల్కి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ప్రత్యేక ఏర్పాట్లు
పదిరోజుల పాటు జరిగే ఉత్సవాలకు వేలాది మంది భక్తులు తరలివస్తారని జగన్నాథస్వామి ఆలయ కమిటీ చైర్మన్ దాడి వరహా సూర్యనారాయణ తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. తాగునీరు, పారిశుధ్యం తదితర సౌకర్యాలు కల్పించడంతో పాటు భద్రత, ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించినట్టు తెలిపారు.


