విశాఖ లీగల్: ప్రజలకు సత్వర, సులభ, తక్కువ ఖర్చుతో న్యాయం అందించడమే లక్ష్యంగా నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ ఉమ్మడి విశాఖ జిల్లాలో విశేష విజయాన్ని నమోదు చేసింది. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో మొత్తం 39 ప్రత్యేక బెంచ్‌లు పనిచేసి 13,382 కేసులను రాజీ మార్గంలో పరిష్కరించాయి. దీంతో ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్న వేలాది మంది కక్షిదారులకు ఊరట లభించింది. లోక్ అదాలత్‌లో ముఖ్యంగా మోటార్ ప్రమాద పరిహార కేసుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన రెండు ప్రత్యేక బెంచ్‌లు 142 మోటార్ ప్రమాద పరిహార కేసులను పరిష్కరించి, బాధితులకు రూ.12 కోట్ల 70 లక్షల 14 వేల పరిహారం అందేలా ఉత్తర్వులు జారీ చేశాయి. దీంతో బాధిత కుటుంబాలకు సత్వర ఆర్థిక ఉపశమనం లభించింది. జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన ఈ జాతీయ మెగా లోక్ అదాలత్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కోర్టుల్లో పేరుకుపోతున్న కేసుల భారం తగ్గించడంతో పాటు, కక్షిదారుల మధ్య పరస్పర అవగాహనతో రాజీ కుదిరేలా చేయడంలో లోక్ అదాలత్‌లు సమర్థవంతమైన వేదికగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు మాట్లాడుతూ, న్యాయమూర్తులు, న్యాయవాదులు, బ్యాంకులు, బీమా సంస్థలు, ప్రభుత్వ శాఖలు, కక్షిదారులు సమన్వయంతో పనిచేయడం వల్ల లోక్ అదాలత్ విజయవంతమైందన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నమ్మి సన్యాసిరావు, ప్రధాన కార్యదర్శి సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఒక్క రోజులోనే 13,382 కేసులకు పరిష్కారం


