సింహం.. సింగిల్‌ సీ ట్రయల్‌ | - | Sakshi
Sakshi News home page

సింహం.. సింగిల్‌ సీ ట్రయల్‌

Jul 12 2026 12:35 AM | Updated on Jul 12 2026 12:35 AM

నౌకా నిర్మాణంలో ఐఎన్‌ఎస్‌ మహేంద్రగిరి కొత్త చరిత్ర

ఒకే ఒక్క సీ ట్రయల్‌తో జలప్రవేశం చేసిన తొలి యుద్ధ నౌక

నిర్మాణ సమయాన్ని 20 శాతం తగ్గించిన స్టెల్త్‌ ఫ్రిగెట్‌

విశాఖ కేంద్రంగా సేవలందించనున్న మహేంద్రగిరి వార్‌షిప్‌

ఐఎన్‌ఎస్‌ మహేంద్రగిరిని జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి

సాక్షి, విశాఖపట్నం: సముద్రం కూడా ఒక పరీక్షా మందిరమే. అక్కడ ఒక్క తప్పిదానికీ అవకాశం ఉండదు. అందుకే యుద్ధ నౌకలు సముద్రంలోకి దిగే ముందు ఐదు.. ఆరు.. ఏడు సార్లు పరీక్షల గడప దాటుతాయి. కానీ ఒక సముద్ర సింహం మాత్రం ఆ సంప్రదాయాన్నే మార్చేసింది. ‘నన్ను ఒక్కసారి పరీక్షించండి.. చాలు’ అని ధీమాగా నిలిచి తొలి ప్రయత్నంలోనే అన్ని ప్రమాణాలను అధిగమించింది. అదే భారత నౌకాదళం కొత్త గర్వకారణం ఐఎన్‌ఎస్‌ మహేంద్రగిరి. విశాఖ నేవల్‌ డాక్‌యార్డులో శనివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చేతుల మీదుగా జాతికి అంకితమైన ఈ స్టెల్త్‌ ఫ్రిగెట్‌.. ఇకపై తూర్పు నౌకాదళంలో భాగమై విశాఖను కేంద్రంగా చేసుకుని భారత సముద్ర సరిహద్దులకు కవచంగా నిలవనుంది. ‘ఇది కేవలం ఒక యుద్ధ నౌక కాదు.. మారుతున్న భారత నావికాదళ ముఖచిత్రానికి, సాంకేతిక స్వయం సమృద్ధికి ప్రతీక’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ కృష్ణ స్వామినాథన్‌ గర్వంగా అభివర్ణించారు.

ఒక్క ఛాన్స్‌.. ఒక్క సక్సెస్‌

సాధారణంగా యుద్ధ నౌకలకు ఐదు నుంచి ఏడు సీ ట్రయల్స్‌ నిర్వహించడం ఆనవాయితీ. ప్రతి పరీక్షలో లోపాలను సరిదిద్దుకుంటూ చివరకు సేవల్లోకి తీసుకొస్తారు. కానీ మహేంద్రగిరి మాత్రం తొలి సముద్ర పరీక్షలోనే అన్ని సాంకేతిక ప్రమాణాలను అధిగమించింది. ఒక్క సీ ట్రయల్‌తోనే సేవలకు సిద్ధమైన తొలి భారతీయ యుద్ధ నౌకగా చరిత్రలో నిలిచింది.

సమయాన్నీ జయించిన యుద్ధనౌక

మహేంద్రగిరి ప్రత్యేకత కేవలం ఒక్క సీ ట్రయల్‌తో ముగియలేదు. సమయాన్ని కూడా ఓడించింది. సాధారణంగా జలప్రవేశం నుంచి నౌకాదళానికి అప్పగించే వరకు 63 నెలలు పట్టే ప్రక్రియను కేవలం 31 నెలల్లో పూర్తి చేసింది. నిర్మాణం ప్రారంభం నుంచి కమిషనింగ్‌ వరకు 95 నెలలు పట్టే పనిని 75 నెలల్లో ముగించి 20 శాతం సమయాన్ని ఆదా చేసింది. నౌకా నిర్మాణ రంగంలో ఇది కొత్త ప్రమాణంగా నిలిచింది.

సముద్రంలో సింహం.. యుద్ధంలో ఉక్కు!

6,670 టన్నుల సామర్థ్యం.. 28 నాట్ల వేగం.. శబ్దవేగాన్ని మించిన బ్రహ్మోస్‌ క్షిపణులు.. గగనతల, జలాంతర్గామి ముప్పులను ఎదుర్కొనే సమగ్ర ఆయుధ వ్యవస్థ.. బహుళ ప్రయోజన హెలికాప్టర్‌.. ఆధునిక రాడార్‌ వ్యవస్థలు.. ఇవన్నీ మహేంద్రగిరిని భారత నౌకాదళంలోని అత్యాధునిక యుద్ధ నౌకల్లో ఒకటిగా నిలబెడుతున్నాయి. 75 శాతానికి పైగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ స్టెల్త్‌ ఫ్రిగెట్‌ను మజగాన్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ నిర్మించింది. ’ఆత్మనిర్భర్‌ భారత్‌’ లక్ష్యానికి ఇది మరో బలమైన నిదర్శనంగా నిలిచింది.

ఐఎన్‌ఎస్‌

మహేంద్రగిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement