విశాఖ మదిలో సుస్థిరం.. జానకమ్మ స్వరం | - | Sakshi
Sakshi News home page

విశాఖ మదిలో సుస్థిరం.. జానకమ్మ స్వరం

Jul 12 2026 12:35 AM | Updated on Jul 12 2026 12:35 AM

చివరిసారిగా మార్చిలో నగరానికి రాక సంగీతాభిమానులకు మధుర జ్ఞాపకాలు

మద్దిలపాలెం/కొమ్మాది/సీతంపేట: ఆమె పాడితే పాటకు ప్రాణం వచ్చేది... ఆమె నవ్వితే ఆప్యాయత ఉట్టిపడేది... ఆమె మాటల్లో వినయం, స్వరంలో మాధుర్యం, వ్యక్తిత్వంలో గొప్పదనం నిండివుండేవి. అలాంటి గానకోకిల జానకమ్మ(ఎస్‌.జానకి) ఇక లేరన్న వార్త విశాఖ సంగీతాభిమానులను విషాదంలో ముంచెత్తింది. దాదాపు ఐదు దశాబ్దాలుగా విశాఖతో ఆమెకు ఏర్పడిన అనుబంధం నగర సంగీత చరిత్రలో చెరగని అధ్యాయంగా నిలిచిపోయింది.

మార్చిలో చివరి పర్యటన

ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు ఎంవీపీ కాలనీలో నివసిస్తున్న తన కోడలు వసుంధర ఇంట్లో జానకమ్మ సుమారు 15 రోజులు గడిపారు. ఆమె నగరంలో ఉన్నారని తెలిసి పలువురు స్థానిక గాయకులు, సంగీతాభిమానులు కలిసి ఆశీస్సులు పొందారు. మను చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో నగరానికి చెందిన యువ గాయకులతో ఆమె ఎంతో సేపు ముచ్చటించారు. పాటలు ఆలకించి సూచనలు చేస్తూ, ‘ఎవరినీ అనుకరించవద్దు... మీ సొంత గొంతే మీ అసలు గుర్తింపు. స్వచ్ఛమైన స్వరంతో పాడితేనే శాశ్వత గుర్తింపు వస్తుంది’అంటూ ప్రోత్సహించారు.

పోస్టర్‌ ఆవిష్కరణ.. ఆప్యాయ క్షణాలు

మార్చి 28న ఎండాడలోని బంధువుల నివాసంలో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమ పోస్టర్‌ను జానకమ్మ ఆవిష్కరించారు. అనంతరం స్థానిక గాయకులు ఆలపించిన పాటలను ఆసక్తిగా విని వారిని ఆశీర్వదించారు. ఆమెతో దిగిన ఫొటోలు ఇప్పుడు వారి జీవితంలో అపురూపమైన జ్ఞాపకాలుగా మిగిలాయి.

లలితాపీఠంలో ప్రత్యేక పూజలు

మార్చి నెలలోనే అక్కయ్యపాలెంలోని శ్రీలలితాపీఠాన్ని సందర్శించిన జానకమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠం మేనేజర్‌ మన్నవ కృష్ణసేన్‌, శివజ్యోతి దంపతులు ఆమెకు అమ్మవారి చిత్రపటం, చీర అందించి సత్కరించారు.

విశాఖ వేదికలపై మధుర గానామృతం

● జానకమ్మకు విశాఖలోని కళాభారతి వేదికతో ప్రత్యేక అనుబంధం ఉంది. 2003లో కె.జనార్ధన్‌ నేతృత్వంలో నిర్వహించిన 12 గంటల నిరవధిక సంగీత విభావరిలో పాల్గొని ప్రేక్షకులను తన గానంతో మంత్రముగ్ధులను చేశారు.

● 2008లో మెలోడీ శంకర్‌ ఆధ్వర్యంలో కళాభారతిలో జరిగిన ప్రత్యేక సంగీత విభావరిలోనూ ఆమె పాల్గొన్నారు. కళాభారతి కార్యదర్శి డాక్టర్‌ గుమ్ములూరి రాంబాబు మాట్లాడుతూ, ‘జానకమ్మ ఆలపించిన స్వరాలు ఇప్పటికీ కళాభారతి వేదికలో మారుమోగుతున్నట్లే అనిపిస్తాయి’అని గుర్తుచేసుకున్నారు.

● సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో జరిగిన సంగీత విభావరిలోనూ, 2013లో పోర్టు కళావాణి ఆడిటోరియంలో నిర్వహించిన సంగీత కార్యక్రమంలోనూ జానకమ్మ తన మధుర గానంతో ప్రేక్షకులను అలరించారు.

● ‘మార్చి 28న ఆమెను చివరిసారిగా కలిశాం. ఎంతో ఆప్యాయంగా మాట్లాడి, స్థానిక గాయకులను ఆశీర్వదించారు. వేలాది పాటలు పాడినా ఏమాత్రం గర్వం లేని మహోన్నత వ్యక్తిత్వం ఆమెది’అని ఘంటసాల స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక కార్యదర్శి చెన్నా తిరుమలరావు స్మరించుకున్నారు.

చెరగని గానముద్ర

17 భాషల్లో వేలాది గీతాలను ఆలపించి భారతీయ సినీ సంగీతానికి అపూర్వ సేవలందించిన జానకమ్మ భౌతికంగా దూరమైనా, ఆమె స్వరం ఎన్నటికీ మరణించదు. విశాఖ వేదికలపై ఆమె ఆలపించిన ప్రతి గీతం, స్థానిక కళాకారులకు అందించిన ప్రతి ప్రోత్సాహం, అభిమానులకు పంచిన ప్రతి ఆప్యాయ క్షణం నగర సంగీత చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. జానకమ్మ లేరు... కానీ ఆమె స్వరం మాత్రం విశాఖ సముద్ర అలల్లా తరతరాల పాటు మారుమోగుతూనే ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement