అనకాపల్లి : విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాటం చేయాలని, దశలవారి పోరాటంలో భాగంగా ఈ నెల 15న విద్యుత్‌శాఖ సీఎండీ కార్యాలయం వద్ద, ఆగస్టు 10న చలో విజయవాడ విద్యుత్ కార్యాలయం నిర్వహిస్తున్నట్టు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయు) రాష్ట్ర అధ్యక్షుడు ముజఫర్ అహ్మద్ అన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో శనివారం విద్యుత్ రంగం ప్రవేటీకరణ– దుష్ప్రభావాలు అనే అంశంపై జిల్లా స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచిత్రంగా ఉద్యోగులను, కాంట్రాక్ట్ కార్మికులను మోసగిస్తుందని, కొత్త పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను సంస్థలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలన్నారు. విద్యుత్ రంగాన్ని కాపాడుకోవడంలో విద్యుత్ ఉద్యోగులు, ప్రజలను కలుపుకొని ప్రజల ఆస్థిగా ఉన్న ఈ రంగాన్ని అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ సంస్థలు కట్ట పెట్టడాన్ని అడ్డుకోవాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉద్యోగ భద్రత లేక కనీసం పక్క తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినట్లుగా రూ.48 వేల బేసిక్ ను కూడా అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను మోసం చేస్తుందన్నారు. సమాన పనికి సమాన వేతనం కోసం, రెగ్యులరైజేషన్ కోసం పోరాటం తప్ప మరో మార్గం లేదని దీనిలో ఉద్యోగులందరినీ ఐక్యపరిచి పోరాటాలు చేస్తామన్నారు. విద్యుత్ స్ట్రగుల్ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా దశల వారి పోరాటంలో కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అందరూ ఐక్యంగా కదలాలన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉమ్మడి జిల్లా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయు) అధ్యక్షుడు ప్రేమ చంద్రశేఖర్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు, రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు వేపాడ సత్యనారాయణ, ఎస్.సత్యారావు, అనకాపల్లి డివిజన్ అధ్యక్షుడు పి.శ్రీనివాసరావు, నర్సీపట్నం డివిజన్ అధ్యక్షుడు ఎస్.రమేష్, సీనియర్ నాయకులు జమీల్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎన్.అవతారం, కె. రాజేష్, కె.పరమేశ్వరరావు పాల్గొన్నారు.


