మాడుగుల రూరల్ : హిందూ ధర్మం బలంగా ఉందంటే, అటువంటి ప్రాంతం శాంతికి నిలయంగా మారిందనే అర్థం గోచరిస్తుందని విశ్వ హిందూ పరిషత్ ప్రాంతీయ సత్సంగ్ ప్రముఖ్ కె.పాపయ్యశాస్త్రి పేర్కొన్నారు. విశ్వ హిందూ పరిషత్ చీడికాడ, మాడుగుల మండలాలకు చెందిన ప్రఖండ్ సమావేశం కె.జె.పురం జంక్షన్‌లో గల కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల వీహెచ్‌పీ అధ్యక్షుడు పుట్టా మురళీకృష్ణ అధ్యక్షత వహించా రు. సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పాపయ్యశాస్త్రి మాట్లాడుతూ హిందువులను ఇతర మతాల్లోకి మార్పిడి చేస్తున్న వారి పట్ల కఠినంగా ఉండాలని, హిందూ ధర్మాన్ని కాపాడడానికి గోమాతను పూజించాలన్నారు. గ్రామాల్లో ధర్మరక్ష దివస్సు, సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడు రాపేట రామకొండలరావు మాట్లాడుతూ చర్చి పాస్టర్లు, మసీదు ఇమామ్‌లకు ప్రభుత్వం నెల నెలా జీతాలు ఇస్తుండగా, హిందూ దేవాలయాల్లో సేవ చేసే అర్చకులకు జీతాలు ఇవ్వలేదని దీనిని ఖండించాలన్నారు. సమావేశంలో వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి పీలా హేమ జగదీశ్‌నాయుడు, వీహెచ్‌పీ ప్రచార్ ప్రముఖ్ పాచిల అప్పారావు, జిల్లా కొశాధి కారి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులతో పాటు వీహెచ్‌పీ నాయకులు చిరుకూరి శివాజీరాజుతో పాటు డెయిరీ డైరెక్టరు శీరంరెడ్డి సూర్యనారాయణ మాట్లాడారు. మాడుగుల గ్రామానికి చెందిన బుద్దా వరలక్ష్మి అనే మహిళ క్రైస్తవ మతం నుంచి హిందూ మతంలోకి వచ్చింది. ఈమెకు పాపయ్యశాస్త్రి తదితరులు కండువా వేసి, బొట్టు పెట్టి ఆహ్వానించారు.


