ముంచంగిపుట్టు: ఆదివాసీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకాలపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ రామారావు దొర డిమాండ్ చేశారు. శనివారం ముంచంగిపుట్టు మండల కేంద్రం నుంచి ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర’ ఘనంగా ప్రారంభమైంది. ఈ యాత్ర మండల కేంద్రంలోని వారపు సంతతో పాటు పలు గ్రామాల గుండా సాగింది.
ముఖ్యమంత్రి హామీలు నెరవేర్చాలి
ఈ సందర్భంగా రామారావు దొర మాట్లాడుతూ.. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాడు గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలన్నీ స్థానిక గిరిజనులకే దక్కేలా చేస్తానని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని మర్చిపోవడం తగదన్నారు. గతంలో ఉన్న జీవో నంబరు 3 రద్దు కావడంతో వేలాది మంది గిరిజన యువతీ యువకులు నిరుద్యోగులుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే ప్రభుత్వం స్పందించి షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం తీసుకురావాలని, గిరిజనేతరులతో భర్తీ చేసిన ఉద్యోగాలను వెనక్కి పంపించి స్థానిక గిరిజనులతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. హైడ్రో పవర్ ప్రాజెక్టులు, బాకై ్సట్ మైనింగ్ పనులను వెంటనే రద్దు చేయాలని కోరారు.
వచ్చేనెల 3న పాడేరులో భారీ ర్యాలీ
ఈ సత్యాగ్రహ యాత్ర గిరిజన గ్రామాల్లో కొనసాగి, ఏప్రిల్ 3వ తేదీన పాడేరు జిల్లా కేంద్రంలో నిర్వహించే భారీ ర్యాలీతో ముగుస్తుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు బాబుజీ, మాధవరావు, రాధాకృష్ణ, లింగన్న, రిటైర్డ్ టీచర్ మోదకొండ, గిరిజన విద్యార్థి సంఘం నేత పార్థసారథి, గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బాబురావు తదితరులు పాల్గొన్నారు.


