యలమంచిలి రూరల్: ఓ రైతుకు చెందిన డీపట్టా భూమిలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలకు వినియోగించిన ఒక పొక్లెయిన్‌తోపాటు ఐదు టిప్పర్ లారీలను పట్టుకుని యలమంచిలి పట్టణ పోలీసులకు అప్పగిస్తే, తదుపరి చర్యలు కోసం కనీసం విచారణ చేయకుండానే విడిచిపెట్టడంతో విమర్శలకు తావిస్తోంది. పట్టణానికి సమీపంలో సర్వే నంబరు 440లో 2.50 ఎకరాల డీ పట్టా భూమిలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని యలమంచిలి పట్టణం కొత్తపేటకు చెందిన రైతు శెలంశెట్టి కనక అప్పలరాజు, భాను దంపతులు కోరుతున్నారు. ఈ మేరకు పట్టణ ఎస్సై, యలమంచిలి తహసీల్దార్, అనకాపల్లి గనుల శాఖ అధికారులకు శనివారం ఫిర్యాదు చేసినట్టు వారు తెలిపారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో తమ భూమిలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నట్టు తెలుసుకుని యలమంచిలి పట్టణ ఎస్సై సావిత్రికి ఫోన్లో తెలియజేస్తే, ఇద్దరు పోలీసులను అక్కడకు పంపించారన్నారు. ఆ సమయంలో అక్కడ ఏపీ39డబ్ల్యూసీ6819, ఏపీ39 యూడబ్ల్యూ7676, ఏపీ39డబ్ల్యూసీ 8169, ఏపీ39డబ్ల్యూసీ 6263, ఏపీ39యూహెచ్ 0757 రిజిస్ట్రేషన్ నంబర్లు కలిగిన 5 టిప్పర్ లారీలు, 200 సామర్థ్యం కలిగిన ఒక పొక్లెయిన్‌తో గ్రావెల్‌ను రవాణా చేస్తున్నట్టు గుర్తించామన్నారు. వాటిని పట్టణ పోలీసులకు అప్పగించగా, శనివారం ఉదయానికి వదిలేశారని వాపోయారు. కొంతకాలంగా తమ భూమిలో స్థానిక జనసేన నాయకుల మద్దతుతో రాత్రిళ్లు అక్రమంగా గ్రావెల్ తవ్వి తరలించుకుపోతున్నారన్నారు. దీనిపై గత నెల 19వ తేదీన యలమంచిలి తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశానన్నారు. గ్రావెల్ అక్రమ తవ్వకందారులతో తమకు ప్రాణహాని ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఏఎంఆర్ సంస్థ బిల్లులు ఉన్నాయి: ఎస్సై
శుక్రవారం రాత్రి యలమంచిలి కనకదుర్గమ్మ గుడి సమీపంలో గ్రావెల్ తవ్వకాలను సంబంధించి ఆ వాహనాల డ్రైవర్ల వద్ద ఏఎంఆర్ సంస్థ జారీ చేసిన బిల్లులు ఉన్నాయని యలమంచిలి పట్టణ ఎస్సై కే సావిత్రి తెలిపారు. అందుకే ఈ వ్యవహారంపై రెవెన్యూ, గనుల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని శెలంశెట్టి కనక అప్పలరాజుకు సూచించామన్నారు. ఈ విషయంలో పోలీసులకు ఎటువంటి సంబంధం లేదన్నారు.


