నేడు వడ్డాదిలో గిరి ప్రదక్షిణ
బుచ్చెయ్యపేట : వడ్డాది వెంకటేశ్వరస్వామి ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణకు తగిన ఏర్పాట్లు చేశారు. మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి గిరి ప్రదక్షిణ చేయడానికి దేవస్ధానం అధికారులు, పాలక వర్గం, ఉత్సవ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. గత ఏడేళ్లుగా వడ్డాదిలో వేంకటేశ్వరస్వామి భక్తులు గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేస్తుండగా పలు గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ ఏడాది గిరి ప్రదక్షణ విజయవంతం చేయడానికి ముందస్తు ప్రచారం చేశారు. వేంకటేశ్వరస్వామి తొలిమెట్టు నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభించి శివాలయం రోడ్డు మరిడిమాంబ పాదాలు,కోవెల అప్పనదొర జిల్లా పరిషత్ హై స్కూల్,జూనియర్ కాలేజీల మధ్య రోడ్డు, బీఎన్ రోడ్డు, వేంకటేశ్వరస్వామి ఆర్చ్ లోపల నుంచి మూడు కిలోమీటర్లు పొడవునా గిరి ప్రదక్షిణ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. శ్రీదేవి,భూదేవి సహిత వేంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను గజ, గరుడ వాహనంపై ఉంచి ఊరేగించడానికి రథాలను సిద్ధం చేశారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త దొండా కన్నబాబు, ఈవో శర్మ, ఉత్సవ కమిటీ సభ్యులు పేరపు రమేష్,ఆడపా శ్రీనివాస్, ఇంటి గాటీలు,దొండా సాయి,పెంటకోట ప్రసాద్ తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఉత్సవ కమిటీ సభ్యులు, పలువురు యువకులు మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు, పులిహార, పండ్లు, గ్లూకోజ్ ఇతర ప్రసాదాలు అందించనున్నారు. గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన భక్తులతో పాటు సాధారణ భక్తులకు స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు.
నేడు వడ్డాదిలో గిరి ప్రదక్షిణ


