సాంకేతిక ప్రమాదమా? బీడీ కాల్చడం వల్లా?
టాటానగర్–ఎర్నాకుళం రైలు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. రైల్వే పోలీసులు సమగ్ర దర్యాప్తునకు శ్రీకారం చుట్టారు. ఇది సాంకేతిక లోపంతో జరిగిందా? లేదా మానవ తప్పిదమా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ప్రమాద సమయంలో స్థానిక పాయింట్స్‌మెన్ ఏసీ కోచ్‌ల్లో వుండే ప్యానెల్‌బోర్డుల నుంచి పవర్ సప్లయి రాకుండా ఎంసీపీని ఆపేశారు. సాధారణంగా ప్యానెల్‌బోర్డు వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయని రైల్వేశాఖ సాంకేతిక సిబ్బంది చెబుతున్నారు. ప్రమాదానికి గురైన ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ బోగీల్లో ప్యానెల్ బోర్డులు భద్రంగానే ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. అయితే బీ1 కోచ్‌లో ప్రయాణికుడు బీడీ కాల్చినట్టు గుర్తించిన రైల్వే పోలీసులు అతడ్ని అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బీడీ లేదా సిగరెట్లు వెలిగించడానికి ఉపయోగించిన అగ్గి పుల్ల పడేయడం వలన అక్కడున్న నైలాన్ దుప్పట్లు, ఉన్ని రగ్గులు, ఇతర వస్త్రాలకు నిప్పంటుకుని అగ్నికీలలు వ్యాపించాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్నిప్రమాదానికి గురైన బోగీల్లో టాయిలెట్లలో కాల్చిపడేసిన సిగరెట్టు ముక్కలు ఉన్నట్టు సమాచారం. ఈ కారణంగా ఏమైనా మంటలు వ్యాపించాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


