హాహాకారాలు
తెల్లారితే నిద్ర లేచి గమ్యం చేరుకోవచ్చు అనుకున్నారు. తమ రైలు ప్రయాణం సాఫీగా సాగిపోతుందనుకుని ధీమాగా నిద్రకు ఉపక్రమించారు. ఒక్కసారిగా పెద్ద కేకలు.. తాము ప్రయాణిస్తున్న రైల్లో మంటలు వ్యాపిస్తున్నాయని తెలుసుకున్నారు. ప్రాణాలను దక్కించుకోవడానికి నిద్రమత్తులోనే రైలు నుంచి దిగేశారు. ఈ క్రమంలో మంటలు పెరిగిపోయాయి. దిగేలోపు ఒక వృద్ధుడు అగ్నికీలలకు బలైపోయాడు. మిగిలిన వారంతా పెను ప్రమాదం నుంచి రెప్పపాటులో బయటపడ్డారు. అర్ధరాత్రి వేళ యలమంచిలి రైల్వేస్టేషన్ ప్రయాణికుల హాహాకారాలతో ప్రతిధ్వనించింది.
అర్ధరాత్రి
● టాటానగర్–ఎర్నాకుళం రైలులో అగ్ని ప్రమాదం
● యలమంచిలి స్టేషన్‌లో దగ్ధమైన రెండు కోచ్‌లు.. వృద్ధుడు మృతి
● అప్రమత్తతతో తప్పిన భారీ ప్రమాదం
● ఘటనకు కారణాలపై రాని స్పష్టత
● పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న రైల్వే అధికారులు
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
మంటల్లో బోగీలు (ఇన్‌సెట్) కాలిపోయిన ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ కోచ్‌లు
యలమంచిలి రూరల్: యలమంచిలి స్టేషన్‌లో ఆగి ఉండగా మంటలు చెలరేగడం.. లోకో పైలెట్లు వెంటనే అప్రమత్తంగా కావడం.. ఒక ప్రయాణికుడు చెయిన్ లాగడంతో ఘోర రైలు ప్రమాదం తప్పింది. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న (18189) ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం అర్ధరాత్రి ప్రమాదానికి గురైంది. రైల్వే సిబ్బంది, తోటి ప్రయాణికులు క్షణకాలంలో స్పందించడం వల్ల ఒక్కరు తప్ప పెనుప్రమాదం నుంచి ప్రయాణికులంతా బయటపడ్డారు. మంటలు చుట్టుముట్టడంతో ఈ ట్రైన్‌లోని రెండు కోచ్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ట్రైన్ ఆదివారం అర్ధరాత్రి 12–45 గంటలకు యలమంచిలి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. వాస్తవానికి ఇక్కడ ఆ ట్రైన్‌కు హాల్టు లేదు. ఈ రైల్వేస్టేషన్‌లో లోకో పైలట్ల విశ్రాంతి గది వుండడంతో ఒక పైలట్‌ను దింపడానికి ట్రైన్ ఆపినట్టు రైల్వే సిబ్బంది చెప్పారు. ఆ తరువాత కాసేపటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రైలు ముందుకు కదల్లేదు. ప్రెజర్ డౌన్ అయిపోయి కదల్లేదని గుర్తించారు. ఏమైందోనని డ్యూటీలో ఉన్న లోకో పైలట్ కిందకి దిగి పరిశీలిస్తుండగా బీ1, ఎం2 ఏసీ కోచ్‌ల నుంచి పొగలు రావడం కన్పించాయి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సెన్సార్లు ఉంటాయని, వాటివల్ల రైలు కదలదని స్టేషన్ సూపరింటెండెంట్ ఆకుల సురేష్ కుమార్ చెప్పారు. ఈ ప్రమాదంలో బీ1 బోగీలో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70) అగ్నికి ఆహుతయ్యారు.
ప్రాణభీతితో పరుగులు..
ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులో మొదట బీ1 ఏసీ కోచ్‌లో మంటలు చెలరేగినట్టు రైల్వే అధికారులు గుర్తించారు. తర్వాత పక్కనే ఉన్న ఎం2 బోగీకి కూడా మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన బోగీలోని ప్రయాణికులు నిద్రలో ఉన్న మిగతా ప్రయాణికులను అప్రమత్తం చేశారు. లగేజీని తీసుకుని కొందరు, వదిలిపెట్టి మరికొందరు ప్రాణభీతితో బయటకు పరుగులు తీశారు. అనంతరం క్షణాల్లో రెండు బోగీలకు మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. రైల్వే స్టేషన్‌లో పాయింట్స్‌మెన్ అగ్ని ప్రమాదాన్ని నివారించే పరికరాలతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో యలమంచిలి అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేస్తే ఫోన్ పనిచేయలేదని రైల్వేస్టేషన్ సిబ్బంది తెలిపారు. రైల్వే ఎస్‌ఎస్ ఆకుల సురేష్‌కుమార్ నేరుగా ఫైర్ స్టేషన్‌కు వెళ్లి కబురు చెప్పారు. వెంటనే అనకాపల్లి, యలమంచిలి, నక్కపల్లి నుంచి అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. పక్కనున్న ఎం1కు మంటలు వ్యాపించకుండా రైల్వే సాంకేతిక సిబ్బంది కోచ్‌ను వేరు చేశారు.
ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణుల బృందం,
ఉన్నతాధికారుల పరిశీలన
ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని నిర్ధారించేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. విశాఖ రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణుల బృందం ప్రమాదంలో కాలిపోయిన రెండు బోగీలను పరిశీలించింది. ప్రమాద కారణాలకు సంబంధించి పలు ఆధారాలు సేకరించారు. ప్రమాద స్థలాన్ని సోమవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాత్సవ, విజయవాడ డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా, రైల్వే డీఐజీ బి.సత్య ఏసుబాబు, రైల్వే ఆర్పీఎఫ్ ఐజీ ఆరోమా సింగ్ ఠాకూర్, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, రైల్వే సేఫ్టీ అధికారులు పరిశీలించారు. సహాయక చర్యలు, ప్రమాదం జరిగిన తీరు స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. బీ1 బోగీలో 76, ఎం2లో 82 మంది మొత్తం 158 మంది ప్రయాణికులున్నట్టు గుర్తించారు. వీరిలో బీ1 బోగీలో విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70) బెర్త్ వద్ద బెడ్‌రోల్స్ ఉన్నచోట నుంచే మంటలు మొదట వ్యాపించినట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇది షార్ట్ సర్క్యూట్ వల్లనా, మానవ తప్పిదం కారణమా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్నది తేలాల్సివుందని డీఐజీ సత్య ఏసుబాబు చెప్పారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు డీఆర్‌ఎం వెల్లడించారు. ప్రమాదంపై రైల్వేశాఖ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ట్రైను ఏసీ కోచ్‌ల్లో సీసీ కెమెరాలు అమర్చారు. సీసీ కెమెరాల ఫుటేజీ లభ్యమైతే అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
జిల్లా పోలీసు, రైల్వే అధికారుల తక్షణ స్పందనతో టాటా నగర్ ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలు అగ్నిప్రమాద తీవ్రత తగ్గిందని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. అందరూ సకాలంలో త్వరితగతిన స్పందించడం వలన మంటలు ఇంకా వ్యాప్తి చెందకుండా చూశామని సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
కలెక్టర్ ఆగ్రహం
విషయం తెలిసిన వెంటనే సోమవారం ఉదయం కలెక్టర్ విజయ్ కృష్ణన్ యలమంచిలి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన రైలు బోగీలను పరిశీలించారు. ప్రమాద కారణాలను లోకో పైలెట్లను అడిగి తెలుసుకున్నారు. రైలులో మిగతా బోగీల్లో ఉన్న ప్రయాణికులను ఎవరూ పట్టించుకోకపోవడంపై కలెక్టర్ స్థానిక రెవెన్యూ, పోలీస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళ ఇంతటి ప్రమాదం జరిగి గంటల తరబడి నిరీక్షించిన ప్రయాణికులు, వాళ్లతో ఉన్న పిల్లలకు పాలు, నీరు ఇవ్వడం తెలియదా? అంటూ రెవెన్యూ అధికారులపై మండిపడ్డారు. తమకు సమాచారం ఆలస్యంగా తెలిసిందని వారు చెప్పగా, అక్కడ ఉన్న స్థానిక పోలీస్ అధికారులపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత ప్రమాదం జరిగితే మా వాళ్లకి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత లేదా.. అని ప్రశ్నించారు. రెవెన్యూకు తెలియకుండా పనిచేసుకుపోతారా? అని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వానికి అధికారికంగా తెలియజేస్తానని హెచ్చరించారు.
కేసు నమోదు
ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాద ఘటనపై తుని రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. యలమంచిలి రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ ఆకుల సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తుని ప్రభుత్వ రైల్వేపోలీస్ స్టేషన్ ఎస్‌ఐ శ్రీనివాసరావు చెప్పారు.
వివరాలు తెలుసుకుంటున్న
కలెక్టర్ విజయ కృష్ణన్
ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న రైల్వే డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా
కాలి బూడిదైన కోచ్‌ను పరిశీలిస్తున్న క్లూస్ టీం సభ్యుడు
చివరిగా భార్యకు ఫోన్..
ఈ ప్రమాదంలో విజయవాడకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు చంద్రశేఖర్ సుందర్ చనిపోయినట్టు మొదట యలమంచిలి సీఐ ధనుంజయరావు గుర్తించారు. అతను మరణానికి కొద్ది నిమిషాల ముందు తన భార్యకు ఫోన్ చేసి, రైలులో ఏదో ప్రమాదం జరుగుతోందని, భయమేస్తోందని, వెంటనే కుమార్తె, అల్లుడిని పంపించాలని కోరాడు. అంతలోనే ఫోన్ సంభాషణ ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో మంటలు అతన్ని బలి తీసుకున్నాయి. బయటకు రాలేక ప్రయాణిస్తున్న బోగీలోనే శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. తాము కారులో వస్తామని చెప్పి తండ్రిని విజయవాడ వెళ్లేందుకు రైలెక్కించామని మృతుని కుమార్తె, అల్లుడు పోలీసులకు చెప్పారు. రైల్వేస్టేషన్‌లో విగత జీవిగా ఉన్న చంద్రశేఖర్ సుందర్‌ను చూసి వారు గుండెలవిసేలా రోదించారు. పోస్టుమార్టమ్ అనంతరం మృతదేహాన్ని వారికి అప్పగించామని యలమంచిలి తహసీల్దార్ వరహాలు చెప్పారు. మృతుడు చంద్రశేఖర్ సుందర్ తనతో తీసుకెళ్లిన బ్యాగులో రూ.6.50 లక్షలు నగదు, బంగారం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీటిలో కొన్ని నోట్లు కాలిపోయినట్టు గుర్తించారు. వాటిని రైల్వే పోలీసులు స్వాధీనపర్చుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఆ శివయ్యే కాపాడాడు
నేను వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని ఆదివారం మధ్యాహ్నం టాటాలో ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ ఎక్కాను. ఈ ట్రైన్ అర్ధరాత్రి యలమంచిలి రైల్వేస్టేషన్ చేరుకునేసరికి పెద్ద పెద్ద మంటలు, పొగలు వ్యాపించాయి. ఏదో ప్రమాదం జరుగుతుందని భావించి నేను నా లగేజీతో బయటకు వచ్చేశాను. గాఢనిద్రలో వుండగా ఈ ప్రమాదం జరిగినప్పటికీ సురక్షితంగా బయటపడ్డాం.
–రామకృష్ణన్, ప్రయాణికుడు
చాలా అదృష్టం
నేను టాటా–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో విశాఖ నుంచి బయల్దేరాను. రైలు ఎక్కిన గంట లోపే మేమున్న ఎం2 కోచ్‌లో పొగ వ్యాపించింది. నాకు ఇంకా నిద్రపట్టకపోవడంతో చూసే సరికి బీ1 కోచ్‌లో మంటలు వ్యాపించాయి. దీంతో మా బోగీలో వున్న ప్రయాణికులందరినీ పెద్ద కేకలు పెట్టి నిద్రలేపాను. దీంతో అందరూ సురక్షితంగా బయట పడ్డారు. ఎవరికీ ఏమీ కాకపోవడం మా అదృష్టమే.
–సూర్యప్రకాష్, దువ్వాడ
హాహాకారాలు
హాహాకారాలు
హాహాకారాలు
హాహాకారాలు
హాహాకారాలు
హాహాకారాలు
హాహాకారాలు


