నిరసన గళంపై ఆంక్షలు
నక్కపల్లి/ఎస్.రాయవరం: బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇచ్చి అండగా నిలిచిన సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు అరెస్టును నిరసిస్తూ సీపీఎం నాయకులు సోమవారం తలపెట్టిన ప్రదర్శనలను పోలీసులు భగ్నం చేశారు. సామాన్యుల పక్షాన నిలిచిన అప్పలరాజుపై పీడీ యాక్ట్ కేసులు పెట్టి జైలుకు పంపడం దారుణమని నిరసన తెలపడానికి కూడా ఈ ప్రజాస్వామ్యంలో హక్కు లేదా అని ఆందోళనకారులు మండిపడ్డారు. నక్కపల్లిలో సోమవారం దుకాణాలు, విద్యాసంస్ధలు, వాణిజ్య సంస్ధలు మూసివేసి నిరసన తెలిపారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అయితే సీపీఎం నాయకులు చేస్తున్న ఆందోళనను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లో సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ర్యాలీలు నిరసనలకు అనుమతి లేదని చెప్పారు. వీరందర్నీ పోలీసు స్టేషన్‌కి తరలించి 41 నోటీసులు ఇచ్చి విడిచి పెట్టినట్లు సీఐ మురళి తెలిపారు. అడ్డురోడ్డులో బంద్ నిర్వహించేందుకు వచ్చిన పలువురు సీపీఎం నాయకులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. తెల్లవారుజాము నుంచి పోలీసులు అడ్డురోడ్డులో గస్తీ నిర్వహించి బంద్ జరగకుండా కాపాలా కాశారు. బంద్ నిర్వహించడానికి ముందుగా జంక్షన్‌కు చేరుకున్న సీపీఎం మండల బాధ్యుడు ఎం.సత్తిబాబు, జిల్లా కార్యవర్గ సభ్యుడు వి.వెంకన్న, జిల్లా కమిటీ సభ్యుడు వి.వి.శ్రీనివాసరావులను అరెస్టు చేసి ఎస్.రాయవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఉదయం 9.30 గంటలకు మరికొంతమంది సీపీఎం నాయకులు, స్థానికులు కలిసి అడ్డురోడ్డు జంక్షన్‌కు వచ్చి నినాదాలు ప్రారంభించడంతో విషయం తెలుసుకున్న పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాసేపు పోలీసులు, ఆందోళనకారులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో వ్యాను తీసుకుని వచ్చి మరికొంతమందిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
నిరసన గళంపై ఆంక్షలు
నిరసన గళంపై ఆంక్షలు


