అంగన్‌వాడీ కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్లు
బుచ్చెయ్యపేట: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేయడంపై పలువురు లబ్ధిదారులు ఆగ్రహం చెందుతున్నారు. బాలింతలు, గర్భిణిలు, చిన్న పిల్లల్లో రక్తహీనతను తగ్గించి వారి ఆరోగ్యం బాగుండాలని, పోషకాలు పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కోడిగుడ్లు సరఫరా చేస్తోంది. నాణ్యతకు దిలోదకాలిచ్చి కుళ్లిన గుడ్లను సరఫరా చేయడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. దిబ్బిడి–2 అంగన్‌వాడీ కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేశారు. గ్రామానికి చెందిన బాలింత పెదిరెడ్ల సునీతకు ఈనెలలో అంగన్‌వాడీ కేంద్రంలో అందించిన కోడిగుడ్లు సగానికిపైగా కుళ్లిపోయాయి. అంగన్‌వాడీ కేంద్రంలో ఇచ్చిన కోడిగుడ్లతో సోమవారం ఆమె ఇంట్లో ఆమ్లెట్ వేసుకోవడానికి చూడగా గుడ్లు కుళ్లిపోవడమే కాక పగలగొట్టిన గుడ్ల నుంచి తీవ్ర దుర్గంధం రావడంతో ఆమె విస్తుపోయింది. గత మూడు దఫాలుగా అందించిన కోడిగుడ్లలో సగానికి పైగా కుళ్లినవే వస్తున్నాయని ఆమె వాపోయింది. ఇటీవల మల్లాం భూపతిపాలెంలో కూడా అంగన్‌వాడీ కేంద్రంలో కుళ్లిపోయిన కోడిగుడ్లను పిల్లలకు అందించడంపై పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం చెందారు.


