రెండేళ్ల ప్రాయంలోనే అనాథగా....
దేవరాపల్లి : మండలంలోని ముషిడిపల్లి జంక్షన్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగయ్యపేట పంచాయతీ శివారు సీతంపేట గ్రామానికి చెందిన జంజూరు అర్జున్ (35) మృతి చెందాడు. ఆనందపురం సమీపంలోని ఓ రెస్టారెంట్‌లో అర్జున్ చెఫ్ (కుక్)గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా వాహనం అదుపు తప్పి సమీపంలో ఉన్న గోతిలో పడిపోయా డు. అటుగా వెళ్తున్న కొందరు ప్రమాదానికి గురైన వాహనాన్ని గుర్తించి, వాహనం నెంబర్ ఆధారంగా ఆన్‌లైన్ చెక్ చేయగా లభించిన ఫోన్ నెంబర్‌కు కాల్ చేయడంతో ప్రమాద విషయం వెలుగులోకి వచ్చింది. అతని కుటుంబీకులు వెంటనే అక్కడికి చేరుకొని అర్జున్‌ను కె.కోటపాడు సీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తమ్ముడు జుంజురి అప్పారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు.
అనాథగా మారిన చిన్నారి
సీతంపేటకు చెందిన అర్జున్‌కు దేవరాపల్లికి చెందిన గౌరీతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు యశ్విన్ ఉన్నాడు. ప్రసవ సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురైన గౌరి బిడ్డకు జన్మనిచ్చిన వారం రోజుల వ్యవధిలోనే మృతి చెందింది. అప్పటి నుంచి కుమారుడికి తల్లి లేని లోటు తెలియకుండా పెంచుతున్న అర్జున్ ఇపుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అభం శుభం తెలియని ఆ చిన్నారిని రెండేళ్ల ప్రాయంలోనే భగవంతుడు తల్లిదండ్రులను దూరం చేసి, అనాఽథని చేశాడంటూ కుటుంబ సభ్యులు రోధించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.
రెండేళ్ల ప్రాయంలోనే అనాథగా....
రెండేళ్ల ప్రాయంలోనే అనాథగా....


