ప్రజా సమస్యలపై మాట్లాడితే అక్రమ కేసులు
అప్పలరాజు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు
ఎస్.రాయవరం : ప్రజా సమస్యలపై మాట్లాడేవారిపై అక్రమ కేసులు పెట్టడం చంద్రబాబు ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిపోయిందని పాయకరావుపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు.అక్రమంగా అరెస్టు అయిన సీపీఎం అప్పలరాజు కుటుంబసభ్యులను ధర్మవరం అగ్రహారంలో సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో లా ఆర్డర్ అదుపులో లేదని, పోలీసులు, అధికారులు నాయకులు, మంత్రులు ఏం చెబితే అదే చేస్తున్నారని విమర్శించారు. బల్క్‌డ్రగ్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్నందుకు అప్పలరాజును ఆందోళన సద్దుమణిగాక అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ప్రజాప్రయోజనాలపై ప్రశ్నించే వారిని గడిచిన 20 నెలలుగా అరెస్టులు చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. తప్పుడు విధానాలతో కూటమి నేతలు ముందుకు వెళితే రాబోయే రోజుల్లో ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. ఈ పరామర్శలో వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు ఎస్‌ఏఎన్ మధువర్మ, ఉపాధ్యక్షుడు వెదుళ్ల బంగారి, యూత్ అధ్యక్షుడు నల్లపురాజు వెంకటరాజు, నాయకులు కర్రి శ్రీను, చొప్పా రాజు, పోలిశెట్టి శ్రీను, శ్రీపాదుల సూర్యనారాయణమ్మ, సుంకర సూర్యనారాయణ, వైస్ ఎంపీపీ చోడిపల్లి అప్పన్న పాల్గొన్నారు.


