విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిన మంత్రి లోకేష్
అనకాపల్లి : ఎన్నికల సమయంలో విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం విద్యార్థుల కష్టాలను తీర్చడంలో విఫలమైందని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌జీ అన్నారు. స్థానిక ఎన్టీఆర్ క్రీడామైదానం వద్ద ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం విద్యార్థుల సమస్యలపై బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికలలో విద్యార్థులకు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 6400 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన లోకేష్ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర అవుతున్నా నేటికీ నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేసిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన విద్యాశాఖ మంత్రి లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీపీ విధానం చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వరరాజు మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహాల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మటిక్ చార్జీలు పెంచాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కళాశాలు, డిగ్రీ కళాశాలు, విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయికుమార్, ఏఐఎస్‌ఎఫ్ మాజీ నాయకులు రాజన్న దొరబాబు, జిల్లా కార్యదర్శి జి.ఫణీంద్ర కుమార్ పాల్గొన్నారు.


