ఇంటర్ బాలిక ఆత్మహత్య
కోటవురట్ల : రాట్నాలపాలేనికి చెందిన ఇంటర్ విద్యార్థిని మున్నూరు మౌనిక (17) ఆదివారం రాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై తల్లి అచ్చియ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రమేష్ తెలిపిన వివరాలివి. మౌనిక ఆదివారం ఉదయం పుస్తకాలు కొనుక్కుంటానని చెప్పి బయటకు వెళ్లింది. కొంత సేపటికి చర్చి దగ్గర ఉన్నాను వచ్చేస్తాను అని తల్లికి ఫోన్‌లో చెప్పింది. దాంతో కుమారుడు శశికుమార్‌ను చర్చి దగ్గరకు వెళ్లి చెల్లిని తీసుకురమ్మని పంపించింది. శశికుమార్ వెళ్లే సరికి మౌనిక కోటవురట్లలోని టెంట్ హౌస్ వద్ద అక్కడ పనిచేస్తున్న కుమార్ అనే యువకుడితో గొడవ పడడం చూశాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన మౌనిక రాత్రి 6.30 గంటల ప్రాంతంలో తలుపులు వేసుకుంది. అనుమానం వచ్చి శశికుమార్ కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వెంటనే సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. తల్లి అచ్చియ్యమ్మ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి ఘటనా స్థలం పరిశీలించగా సూసైడ్ నోట్‌ను గుర్తించారు. అందులో మౌనిక తాను లోకేష్ అనే యువకుడిని ప్రేమించానని, అదే సమయంలో పందూరుకు చెందిన మరో యువకుడు కుమార్‌తో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారడంతో ఈ విషయం తెలిసిన లోకేష్ తనతో మాట్లాడడం మానేశాడని పేర్కొంది. లోకేష్ మాట్లాడకపోవడాన్ని తట్టుకోలేక తన వల్ల తల్లిదండ్రులకు అవమానం జరగకూడదనే ఉద్దేశ్యంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు నోట్‌లో పేర్కొంది. పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


