అలరించిన నాటికలు
అనకాపల్లి: నేటి యువతరానికి ఆసక్తిపెంచే విధంగా నాటికలను ప్రదర్శించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. స్థానిక జార్జిక్లబ్ ఆవరణలో హైదరాబాద్ మహతి క్రియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నాటకోత్సవాలను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. గతంలో గ్రామాల్లో ఉత్సవాలు నిర్వహించే సమయంలో ప్రదర్శించిన నాటకాలను అక్కడ ప్రజలు ఎంతగానో తిలకించేవారని చెప్పారు. యువ తరానికి నాటకాలపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు.
మొదటి నాటిక ‘సమయం’
గుంటూరు అభినయ్ ఆర్ట్స్ ప్రదర్శించిన సమయం నాటిక ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రతి మనిషికి ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. దానిని అనుకూలంగా మార్చుకుంటే సామాన్యుడు రాజవుతాడు.. రాజు కుబేరుడవుతాడు. కానీ అదే సమయాన్ని మర్చిపోయి పరుగెడితే అందమైన జీవితానికి అర్థం లేకుండా పోతుంది. సమయాన్ని వదిలేస్తే పరిణామాలు ఏవిధంగా ఉంటాయో దీనిలో వివరించారు. ఈ నాటికను స్నిగ్థ రచించగా, ఎన్.రవీంద్రరెడ్డి దర్శకత్వం వహించారు.
‘నువ్వో సగం–నేనో సగం’...
హైదరాబాద్, మల్లీశ్వరి ఆర్ట్స్ వారు ప్రదర్శించిన ‘నువ్వోసగనం–నేనోసగం’ నాటిక ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. నాటిక సారాంశం....సీ్త్రకి ఆర్థిక స్వాతంత్య్రం కావాలి మగవారితో సమాన హక్కులు కల్పించాలి కానీ ఏదైనా సగం..సగం.. నువ్వెంతో నేనూ అంతే అన్న ధోరణిలో ఉండే సంసారం సవ్వంగా నడవదు... కష్టాల్లో సుఖాల్లో, కలిమిలో లేమిలో కలిసిమెలిసి జీవించేదే నిజమైన దాంపత్యం అన్ని తెలియజేసేదే ‘నువ్వో సగం–నేనోసగం’ నాటిక.. దీనికి పొలిమేట్ల సుబ్బారావు దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జార్టీక్లబ్ అధ్యక్షుడు బి.ఎస్.ఎం.కె.జోగినాయుడు, కార్యదర్శి బుద్ధ కాశీవిశ్వేశ్వరరావు, కోశాధికారి విల్లూరి చంద్రశేఖర్, నాటకోత్సవాల కన్వీనర్ కె.ఎం.నాయుడు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


