నాలుగు నెలల పసికందు మృతి
● వైద్యుడి నిర్లక్షమే కారణమని
తల్లిదండ్రుల ఆరోపణ
● వైద్య సేవల లోపం లేదని డాక్టర్ వివరణ
నర్సీపట్నం: వైద్యుడి నిర్లక్ష్యం వల్లనే తమ నాలుగు నెలల బిడ్డ మరణించాడని చింతపల్లి మండలం తాజంగి గ్రామానికి చెందిన తల్లిదండ్రులు పాంగి చంద్రమ్మ, పూర్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డ రెండు రోజులుగా జ్వరం, వాంతులతో బాధ పడుతుండడంతో నర్సీపట్నంలోని వినాయక చిల్డ్రన్ హాస్పటల్‌కు తీసుకువచ్చామని వారు తెలిపారు. హాస్పటల్‌కు తీసుకురాగానే డాక్టర్ అయ్యప్ప ఆదేశాల మేరకు సిబ్బంది బాబుకు ఇంజక్షన్ ఇచ్చారని, టెస్ట్‌లు చేయించుకురమ్మని దినేష్ మెడికల్ ల్యాబ్‌కు పంపించారని చెప్పారు. బాబును ల్యాబ్ తీసుకువెళ్లామని, రక్తం తీస్తుండగా ఏడ్చి ఏడ్చి మృతి చెందాడని, సకాలంలో వైద్యం అందక తమ బిడ్డ మృతి చెందాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై డాక్టర్ అయ్యప్పను వివరణ కోరగా వ్యాధి నిర్ధారణ కోసం బాబుకు టెస్టులు చేయించమని దినేష్ మెడికల్ ల్యాబ్‌కు పంపించామని, వచ్చే లోగానే బాబు మరణించటం బాధాకరమని డాక్డర్ తెలిపారు. బాబు బంధువులు తనపై ఆరోపణలు చేయటం వల్ల పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు.


