బావిలో పడి విశాఖ డెయిరీ ఉద్యోగి మృతి
కె.కోటపాడు : మండలంలో పాతవలస గ్రామానికి సమీపంలో గల బావిలో ప్రమాదవశాత్తూ పడి విశాఖడెయిరీలో వెటర్నరీ డాక్టర్‌గా పనిచేస్తున్న పిల్లా కొండలరావు(32) మృతిచెందాడు. మృతుడి సోదరుడు అప్పలనాయుడు ఆదివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ ఆర్.ధనుంజయ్ తెలిపిన వివరాలు..రావికమతం మండలం గొంప గ్రామానికి చెందిన కొండలరావు కె.కోటపాడులో విశాఖడెయిరీలో వెటర్నరీ వైద్యుడిగా పనిచేస్తూ భార్య శిరీష, కుమారుడు, కుమార్తెతో స్థానికంగా నివాసముంటున్నాడు. ఈ నెల 27వ తేదీ సాయంత్రం కొండలరావు బహిర్భూమికని బైక్‌పై ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో భార్య శిరీష ఈ సమాచారాన్ని బంధువులకు, స్థానిక విశాఖడెయిరీ ఉద్యోగులకు తెలిపింది. రాత్రంతా కొండలరావు కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం పాతవలసకు వెళ్లే మార్గంలో కొండలరావు బైక్‌ను గమనించారు. ఆ పరిసరాల్లో గాలిస్తుండగా నేల బావిలో మృతదేహాన్ని గమనించారు. కొండలరావు మృతిపై కుటుంబ సభ్యులు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్టు ఆయన చెప్పారు. భర్త మృతితో భార్య శిరీష,కుమార్తె, కుమారుడు గుండెలవిసేలా రోదించడం స్థానికులను కంటతడి పెట్టించింది.


