వరి పంటతో ట్రాక్టర్ దగ్ధం
● రూ.1.20 లక్షల నష్టం
బుచ్చెయ్యపేట: మండలంలోని వడ్డాదిలో వరి పంటతో ఉన్న ట్రాక్టర్ దగ్ధమైంది. గ్రామానికి చెందిన బొబ్బాది రాజు తన పొలంలో సాగు చేసిన వరి చేనును నాలుగు రోజుల కిందట కోశాడు. ఆదివారం దానిని ట్రాక్టర్‌లో లోడ్‌చేసి, పాక దగ్గరకు తీకొస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో వరి పంటతో పాటు ట్రాక్టర్ తొట్టె దగ్ధమైంది. సమీపంలో ఉన్న రైతులు మంటలను ఆర్పడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ ప్రమాదంలో బొబ్బాది రాజుకు చెందిన ఎకరా వరి పంటతో పాటు విజయరామరాజుపేటకు చెందిన కాశీనాయుడు ట్రాక్టర్ తొట్టె కాలిపోయి, రూ.1.20 లక్షల నష్టం జరిగింది. ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటంతా కాలిపోవడంతో ఏడాది తిండి గింజలు దక్కని పరిస్థితి ఏర్పడిందని బాధిత రైతు రాజు వాపోయాడు.


