అంగన్‌వాడీల యాప్‌సోపాలు | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల యాప్‌సోపాలు

Dec 28 2025 7:39 AM | Updated on Dec 28 2025 7:39 AM

అంగన్

అంగన్‌వాడీల యాప్‌సోపాలు

అంగన్‌వాడీ కార్యకర్తలు యాప్‌లతో ఆపసోపాలు పడుతున్నారు. యాప్‌లను నిర్వహించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా పోషణ ట్రాకర్‌, బాల సంజీవని యాప్‌ల్లో లబ్ధిదారుల ముఖ హాజరు నమోదుకు ఇబ్బందులు పడుతున్నారు.

సాక్షి, అనకాపల్లి: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహార పంపిణీ ప్రక్రియలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలతో కార్యకర్తలు, లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 1,908 అంగన్‌వాడీ కేంద్రాలుండగా వీటికి చంద్రబాబు సర్కార్‌ 1,409 (5జీ)స్మార్ట్‌ మొబైల్స్‌ను అందజేసింది. పంపిణీ చేసిన 10 రోజులకే సగానికిపైగా ఫోన్లు పనిచేయడం మానేశాయి. గర్భిణులతో పాటు ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు వయసున్న పిల్లల తల్లులకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఇందులో పారదర్శకత కోసం లబ్ధిదారుల ముఖ ఆధారిత గుర్తింపును (ఫేషియల్‌ రికగ్నేషన్‌)ను, రోజు వారీ వివరాలను బాల సంజీవని, పోషణ్‌ ట్రాకర్‌ యాప్‌లలో నమోదు చేసిన తర్వాతే సరకులు అందించాలి. సర్వర్‌ సమస్య కారణంగా ఆయా యాప్‌లు తరచూ మొరాయిస్తున్నాయి. ఒక్కోసారి రెండు, మూడు గంటల పాటు పనిచేయడం లేదు. ఫలితంగా లబ్ధిదారులు అంగన్‌వాడీ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలల పాటు కాలయాపన చేసి..ఇటీవల 5జీ స్మార్ట్‌ ఫోన్లు అందజేసింది. అవి మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. రెండు వారాలకే సర్వర్‌ సమస్యతో మొబైల్‌లో ఉన్న యాప్‌లు మొరాయిస్తున్నాయి. కొత్తగా ఇచ్చిన ఈ 5జీ మొబైల్స్‌కు ఒక వైపు నెట్‌వర్కు సమస్య..మరో వైపు యాప్‌ వెర్షన్‌ సమస్య వంటి సాంకేతిక సమస్యలతో అప్‌లోడింగ్‌ ఆలస్యమవుతోంది. దీంతో సూపర్‌ వైజర్లు, ఉన్నతాధికారుల నుంచి అంగన్‌వాడీ వర్కర్లపై ఒత్తిడి పెరుగుతోంది. అసలు కంటే యాప్‌ల పనే ఎక్కువగా ఉండడంపై అంగన్‌వాడీ వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళితే వెర్షన్‌ అప్‌టుడేట్‌ అయిన తరువాత ఆ సమస్య ఉండదంటున్నారు.

పని పెరిగి.. బోధన తగ్గి..

ప్రస్తుతం అంగన్‌వాడీ కార్యకర్తలు ఆయా కేంద్రాల్లో లబ్ధిదారులకు ఆహార వినియోగం, పిల్లలు, బాలింతలు, గర్భిణుల నమోదు, ప్రీ స్కూల్‌ అడ్మిన్‌ రికార్డులను ప్రతి రోజూ విధిగా నమోదు చేయాలి. మరోవైపు పిల్లల టీకాల రికార్డులు, విటమిన్‌–ఎ రికార్డు, రిఫరల్‌ సర్వీసెస్‌, గృహ సందర్శకుల రికార్డులు, నెలవారీ ప్రాజెక్టులు, హౌస్‌ హోల్డ్‌ సర్వే రికార్డు, గ్రోత్‌ చార్ట్‌ తదితర అంశాలను యాప్‌లలో నమోదు చేస్తున్నారు. ఇప్పుడు ఈ యాప్‌లలో నమోదు ప్రక్రియ కష్టంగా మారింది. గతంలో లబ్ధిదారుల ముఖ ఆధారిత గుర్తింపు నమోదు కాకపోయినా రిజిస్టర్‌లో సంతకం తీసుకుని, సరుకులు అందజేసేవారు. ఇప్పుడు ముఖ ఆధారిత గుర్తింపును తప్పనిసరి చేశారు. సర్వర్‌ సమస్యల కారణంగా యాప్‌లు మొరాయిస్తుండడంతో గంటల కొద్దీ లబ్ధిదారులు కేంద్రాల వద్ద వేచి ఉండాల్సి వస్తోంది. కొంతమంది నెలలో ఐదారుసార్లు కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ పనితోనే కార్యకర్తలకు రోజులో ఎక్కువ సమయం గడిచిపోతుడడంతో అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లల చదువు అటకెక్కుతోంది. అంగన్‌వాడీ సూపర్‌ వైజర్లు, ఉన్నతాధికారులు అధికారులు ఈ వివరాలు నమోదు చేయడంలో ఆలస్యమైతే చాలు..వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేస్తారు. ఫోన్‌ మీద ఫోన్‌ చేసి వివరాలు నమోదు చేయాల్సిందేనని ఒత్తిడి తెస్తారు. దీంతో పిల్లలకు చదువు చెప్పడంపై దృష్టి పెట్టకుండా వీటి నమోదుపైనే అధికంగా దృష్టి సారిస్తున్నారు.

వస్తువులున్నా.. లేనట్లు చూపుతూ..

యాప్‌ పనిచేయకపోవడంతో బాల సంజీవని, పోషణ్‌ ట్రాకర్‌ యాప్‌లలో వివరాలు సక్రమగా నమోదు కావడం లేదు. గర్భిణులు ఆస్పత్రిలో పేషియల్‌ అంటెడెన్స్‌ వేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక గర్భిణి పేరు ప్రతి నెలా 1వ తేదీ నుంచి 10వ తేదీ లోపు నమోదు కాకపోతే..తరువాత నెలకు వారికిచ్చే పౌష్టికాహారం స్టాక్‌ రాదు. ఈ యాప్‌ పనిచేయకపోవడంతో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది.

‘బాలసంజీవని’ యాప్‌లో రోజూవారీ గర్భిణులు, బాలింతలు, పిల్లలు హాజరు నమోదు చేసుకోవాలి. లబ్ధిదారులు, పిల్లలు ఫేస్‌ రికగ్నేషన్‌ అప్‌లోడ్‌ చేయాలి. అంతేకాకుండా ఆ రోజు మెనూ కూడా అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. సరుకులు రాక, పంపిణీకి సంబంధించిన వివరాలను కూడా అప్‌టుడేట్‌ చేయాల్సి ఉంటుంది.

‘పోషణ ట్రాకర్‌ యాప్‌’లో అంగన్‌వాడీ కేంద్రాల కార్యకలాపాలు, సేవలు, లబ్ధిదారుల నిర్వహణను పర్యవేక్షణ, పోషకాహార పంపిణీ, పెరుగుదల, ఆరోగ్య సమాచారాన్ని నమోదు చేయాలి.

బాల సంజీవని యాప్‌లో పోషకాహారం వివరాలు నమోదు చేసి, లబ్ధిదారుల ముఖ ఆధారిత గుర్తింపు నమోదుకు ప్రయత్నిస్తే.. ప్లీజ్‌ కాంటాక్ట్‌ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అని చూపుతూ మొరాయిస్తోంది.

కొన్ని సందర్భాల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో సరకులు నిల్వ ఉన్నా.. లేవని చూపుతోంది. ఇలా వచ్చినప్పుడు వాటిని లబ్ధిదారులకు ఇవ్వడానికి వీలుపడదు.

సర్వర్‌ సమస్య కారణంగా రిజిస్ట్రేషన్‌ సకాలంలో పూర్తికావడం లేదు.

కొత్త లబ్ధిదారుల రిజిస్ట్రేషన్‌ సమయంలో తీసుకున్న ఆధారిత గుర్తింపు వివరాలు.. వారికి సరకులు అందించేటప్పుడు తీసుకునే ఫేషియల్‌ రికగ్నేషన్‌ సరిపోలడం లేదు.

పోషణ్‌ ట్రాకర్‌ యాప్‌లో ఈకేవైసీ నమోదులోనూ జాప్యమవుతోంది. తరచూ ‘ఎరర్ర్‌’ అని చూపుతూ నిలిచిపోతోంది.

జిల్లాలో ఇలా...

అంగన్‌వాడీ కేంద్రాలు 1,908 మెయిన్‌ కేంద్రాలు 1,725 మినీ కేంద్రాలు 183 అంగన్‌వాడీ వర్కర్లు 1,882 మంది హెల్పర్లు 1,665 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్న లబ్ధిదారులు 59,890 మంది అందజేసిన స్మార్ట్‌ మొబైల్స్‌ 1,409

లబ్ధిదారుల ముఖ హాజరు నమోదులో ఇబ్బందులు

సర్వర్‌ సమస్యతో తరుచూ మొరాయింపు

మరోపక్క రికార్డులతో సతమతం

రోజు వారీ వివరాలు అప్‌లోడ్‌ చేయాలంటూ అధికారుల నుంచి ఒత్తిడి

పౌష్టికాహారం పంపిణీలో సాంకేతిక సమస్యలు

మున్నాళ్ల ముచ్చటగా మారిన 5జీ స్మార్ట్‌ ఫోన్లు

ఇచ్చిన పది రోజులకే సగానికి పైగా పనిచేయని ఫోన్లు

అంగన్‌వాడీల యాప్‌సోపాలు 1
1/2

అంగన్‌వాడీల యాప్‌సోపాలు

అంగన్‌వాడీల యాప్‌సోపాలు 2
2/2

అంగన్‌వాడీల యాప్‌సోపాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement