రేబాక–అల్లుమియ్యపాలెం రోడ్డుకు చంద్రగ్రహణం
గత ప్రభుత్వంలో రూ.8 కోట్లు మంజూరు, 40 శాతం పనులు పూర్తి
10 నెలలుగా నిలిచిపోయిన నిర్మాణం
రాళ్లుతేలిన రోడ్డుపై రాకపోకలకు ఇబ్బందులు
నక్కపల్లి: రేబాక–అల్లుమియ్యపాలెం రోడ్డు నిర్మాణానికి చంద్రగ్రహణం పట్టింది. నక్కపల్లి , ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాలకు అనుసంధానం చేస్తూ పలు గ్రామాలకు రహదారి సదుపాయం కల్పించేందుకు గత వైఎస్సార్‌సీసీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.8 కోట్ల వ్యయంతో రేబాక నుంచి సీతం పాలెం, తిరుపతి పాలెం మీదుగా అల్లుమియ్యపాలెం నుంచి కోటవురట్ల, నర్సీపట్నం వెళ్లేందుకు సుమారు 11.6 కిలో మీటర్ల మేర తారు రోడ్డు నిర్మించడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేసింది. ఈ రోడ్డు నిర్మిస్తే రేబాక , అల్లుమియ్యపాలెం మీదుగా కోటవురట్ల, నర్సీపట్నం చేరుకునేందుకు సుమారు 20 కిలోమీటర్లదూరం తగ్గడంతోపాటు, సమయం ఆదా అవుతుంది. గత ఏడాది ఫిబ్రవరి16న అప్పటి ఎమ్మెల్యే గొల్ల బాబూరావు రోడ్డు నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కగ్రామానికి కూడా సరైన రోడ్డు సదుపాయం కల్పించకపోగా, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులను తమ ప్రభుత్వంలోనే మంజూరు చేసినట్టు ప్రచారం చేసుకున్నారు. హోం మంత్రి అనిత ఆధ్వర్యంలోనే నిధులు మంజూరై పనులు జరుగుతున్నాయంటూ ఫొటోలు, వీడియోలు తీయించి సోషల్‌మీడియాలో ప్రచారం చేయించుకున్నారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చే నాటికే దాదాపు 40 శాతం పనులు పూర్తయ్యాయి. నాలుగు కల్వర్టులు నిర్మించారు. తర్వాత మధ్యలో ఆగిపోయాయి.
10 నెలలుగా బ్రేక్
రేబాక నుంచి సీతంపాలెం వరకు 3 కిలోమీటర్ల సిమెంట్ వెట్‌మిక్స్ వేసి రోలింగ్ చేసి వదిలేశారు. సుమారు 10 నెలలనుంచి ఈ పనులను అలాగే వదిలేశారు. అసంపూర్తిగా ఉన్న రోడ్డుపై బీటీ వేయకపోవడం వల్ల రాళ్లు లేచిపోయి రాకపోకలకు ఇబ్బందిగా ఉందని ఆయా గ్రామాల వారు చెబుతున్నారు. పంచాయతీ రాజ్ శాఖతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పనులు ఈ ఏడాది ఫిబ్రవరిలోగా పూర్తిచేయాల్సి ఉంది. కానీ అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రాకపోకలు సాగించేవారు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రేబాక, తిరుపతిపాలెం, అల్లుమియ్యపాలెం గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులకు ఈ రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న మామిడి, జీడితోటల నుంచి సేకరించి పండ్లను ఈమార్గంలోనే రవాణా చేయాలి. రోడ్డు నిర్మాణం పూర్తయితే రైతులకు రవాణా ఖర్చులు కూడా తగ్గుతారయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు.
రహదారి కష్టాలు తీర్చాలి
రోడ్డు పనులు నిలిచిపోయి 10 నెలలు అయింది. రాళ్లు పైకి లేచిపోతున్నాయి. ఈ రోడ్డుపూర్తయితే నక్కపల్లి, కోటవురట్ల మధ్య రహదారి సదుపాయం మెరుగు పడుతుంది. గిరిజనుల రహదారి కష్టాలు తొలగిపోతాయి. కాంట్రాక్టర్‌ను అడిగితే సంక్రాంతి తర్వాత తిరిగి మొదలు పెడతామంటున్నారు. అధికారులు స్పందించి ఈ రోడ్డుపూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలి.
27ఏడిఆర్06 – సాదిరెడ్డి శ్రీను, సర్పంచ్,రేబాక
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నిధులు మంజూరు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గిరిజన గ్రామాలకు తారు రోడ్డు సదుపాయం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ద్వారా నాటి సీఎం జగనన్న దృష్టికి తీసుకెళ్లి రూ.8 కోట్లు మంజూరు చేయించడం జరిగింది. అప్పట్లోనే పనులు సగం పూర్తయ్యాయి. తాజాగా ఈ రోడ్డుకు తమ ప్రభుత్వమే నిధులు మంజూరు చేసిందంటూ టీడీపీ నాయకులు సోషల్‌మీడియాలో ప్రచారం చేసుకున్నప్పటికీ పనులు పూర్తిచేయలేదు. చిత్తశుద్ధి ఉంటే ఈ పనులు పూర్తిచేయించాలి.
– వీసం రామకృష్ణ, వైఎస్సార్‌సీపీ రాష్ట్రకార్యదర్శి
రేబాక–అల్లుమియ్యపాలెం రోడ్డుకు చంద్రగ్రహణం
రేబాక–అల్లుమియ్యపాలెం రోడ్డుకు చంద్రగ్రహణం


