మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలి
నర్సీపట్నం: వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌కు అప్పగించడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. విద్య, వైద్యంను ప్రజలకు అందించడం ప్రభుత్వం కనీస బాధ్యత అని చెప్పారు. విశాఖలో జరిగిన ప్రధాన మంత్రి కార్యక్రమం, పరిశ్రమల సమ్మెట్‌ల పేరిట రూ.వేల కోట్లు ప్రజాధనాన్ని ప్రభుత్వం వృథాగా ఖర్చు చేసిందన్నారు. దీని వల్ల ఒకరికై నా ఉపాధి కలిగిందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆ డబ్బుతో పాడేరు, నర్సీపట్నం మెడికల్ కాలేజీలను పూర్తి చేయవచ్చని చెప్పారు. పీపీపీ పేరుతో ప్రభుత్వ కళాశాల నిర్మాణానికి టెండర్లు పిలిచినప్పటికీ ఒకరే ముందుకువచ్చారని, ఒక డాక్టర్ వేశారని, మేము కాదని కిమ్స్ యాజమాన్యం ప్రకటించడం చంద్రబాబు ప్రభుత్వంపై వారుకున్న నమ్మకానికి నిదర్శనమన్నారు. ప్రజా ఉద్యమాలను అణిచివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం అక్రమ అరెస్ట్‌లకు పాల్పడుతోందని మండిపడ్డారు. బల్క్‌డ్రగ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమానికి అండగా నిలిచిన సీసీఎం నాయకుడు అప్పలరాజుపై పీడీ యాక్ట్ ప్రయోగించటం అన్యాయమన్నారు. జిల్లాలో తీరప్రాంతంలోని భూములని కార్పొరేట్లకు అప్పగిస్తున్నారు.ఆ భూముల్లో పరిశ్రమలు పెట్టకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజయ్యపేట ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో బల్క్‌డ్రగ్ పార్కును పెట్టబోమని సీఎం చంద్రబాబునాయుడు నోటి మాటగా చెప్పారని, అలాకాకుండా నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఆ భూములను మిట్టల్ కంపెనీకి అప్పజెప్పేందుకు ప్రభుత్వం నాటకం ఆడుతోందని ఆరోపించారు. సీపీఎం కేంద్ర కమిటీ నాయకులు కె.లోకనాథం, జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, అడిగర్ల రాజు, సాపిరెడ్డి నారాయణమూర్తి, గౌరీ, సూర్యప్రభ తదితరులు పాల్గొన్నారు.


