ఫలించిన వైఎస్సార్‌సీపీ పోరాటం
మునగపాక/నక్కపల్లి : వైఎస్సార్‌సీపీ పోరాటం ఫలించింది. మునగపాక మండలాన్ని అనకాపల్లి డివిజన్‌లోనే కొనసాగించనున్నారు. మరో పక్క జిల్లాలో కొత్తరెవెన్యూ డివిజన్ ఏర్పాటులో మార్పులు జరిగాయి. ముందుగా ప్రకటించినట్టు నక్కపల్లి కేంద్రంగా కాకుండా అడ్డురోడ్డు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గత నెల 27వ తేదీన మునగపాక మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేయబోయే నక్కపల్లి డివిజన్‌లో కలుపుతున్నట్లు ప్రభుత్వం జీవో నంబర్ 1491 విడుదల చేసిన సంగతి తెలిసిందే. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటులో భాగంగా నక్కపల్లి కేంద్రంగా డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. నక్కపల్లి డివిజన్‌లో యలమంచిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలు విలీనం చేస్తున్నట్లు జీవోలో పొందుపరిచారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతుల సహకారంతో వైఎస్సార్‌సీపీ ఆందోళన చేపట్టింది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో రైతులు, ప్రజలతో కలిసి ధర్నాలు, మానవహారాలు నిర్వహించింది. నక్కపల్లి డివిజన్‌లో కాకుండా అనకాపల్లి డివిజన్‌లోనే యలమంచిలి నియోజకవర్గం కొనసాగించే చూడాలని కోరుతూ మునగపాకలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలను మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాఽథ్ ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకొని స్థానిక అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్త కరణం ధర్మశ్రీతో కలిసి వారం రోజుల పాటు దీక్షలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రజలనుంచి వస్తున్న అభ్యంతరాలకనుగుణంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అఽధికారులను ఆదేశించినట్లు సమాచారం. ముందుగా ప్రకటించినట్టు నక్కపల్లి కేంద్రంగా కాకుండా అడ్డురోడ్డు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా నక్కపల్లి రెవెన్యూ డివిజన్‌కు మోకాలడ్డినట్లు సమాచారం.అడ్డురోడ్డుకేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ఏర్పాటు చేస్తూ అచ్యుతాపురం, యలమంచిలి, రాంబిల్లి మండలాలతోపాటు, పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, కోటవురట్ల, మండలాలను ఈ డివిజన్‌లో చేర్చనున్నారు. మునగపాక మండలాన్ని మాత్రం అనకాపల్లి డివిజన్‌లోనే కొనసాగించాలని నిర్ణయించారు.నర్సీపట్నం డివిజన్‌లో ఉన్న చీడికాడ మండలాన్ని అనకాపల్లి డివిజన్‌లో కలిపేందుకు నిర్ణయించారు.
భిన్నాభిప్రాయాలు
ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నక్కపల్లి కేంద్రంగానే కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. బ్రిటీష్ కాలంనుంచి నక్కపల్లి తాలూకా కేంద్రంగా ఉందని, సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ అంతా నక్కపల్లి తాలూకా కార్యాలయాలనుంచే జరుగుతుందనిపలువురు చెబుతున్నారు. గతంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో యలమంచిలి, నక్కపల్లి తాలూకా కేంద్రాలుగా ఉండేవని,తర్వాత మండలాలుగా ఏర్పాటయ్యాయని అంటున్నారు. నక్కపల్లిని కాకుండా అడ్డురోడ్డు కేంద్రంగా డివిజన్ ఏలా ఏర్పాటు చేస్తారన్న పశ్నలు తలెత్తుతున్నాయి.కనీసం పంచాయతీకూడా కానీ అడ్డురోడ్డులో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం తగదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


