ఎంఎస్‌ఎంఈ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌పై చర్యలు
రాంబిల్లి(అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని పూడి రెవెన్యూ పరిధిలో గల ఎంఎస్‌ఎంఈ కళాశాలలో విద్యార్థులు, ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌కు మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జీఎం రాజశేఖర్ రంగంలోకి దిగి, శనివారం కళాశాల వద్ద ఆందోళన చేస్తున్న కొందరు విద్యార్థులతో పాటు అధికారులతో చర్చలు జరిపారు. ప్రిన్సిపాల్ వ్యవహార శైలిపై ఫిర్యాదు చేసిన విద్యార్థుల వద్ద వివరాలు తెలుసుకొన్నారు. ఐదుగురు విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. విద్యార్థుల డిమాండ్ మేరకు ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ మురళీకృష్ణను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో మరో విభాగాధిపతి వెంకటేశ్వరరావును ప్రిన్సిపాల్‌గా నియమించాలని సూచన ప్రాయంగా నిర్ణయించారు. ప్రిన్సిపాల్‌ను మారుస్తున్నట్లు తెలియడంతో విద్యార్థులు శాంతించారు.సోమవారం నుంచి యథావిధిగా తరగతులు నిర్వహించాలని యాజమాన్యం ఆదేశించింది.
ఏఐఎస్‌ఎఫ్ ఆందోళన...
ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారని తెలుసుకున్న ఏఐఎస్‌ఎఫ్ నాయకులు కళాశాల వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. అయితే యాజమాన్యం ఏఐఎస్‌ఎఫ్ సభ్యులను లోనికి అనుమతించలేదు.ఇదే సమయంలో జీఎం రాజశేఖర్ రావడంతో చర్చలు జరిపారు. ఆందోళనలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాబ్జి,కార్యదర్శి ఫణీంద్రకుమార్,జిల్లా నాయకులు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


