ఏడు ద్విచక్రవాహన యజమానులకు జరిమానా
యలమంచిలి రూరల్ : మైనర్లకు వాహనాలిస్తే వాహన యజమానులదే బాధ్యత అని,చట్టప్రకారం మైనర్లకు వాహనాలివ్వడం నేరమని యలమంచిలి ట్రాఫిక్ ఎస్సై బి రామకృష్ణ స్పష్టం చేశారు. గురువారం ఆయన తన సిబ్బందితో కలిసి యలమంచిలి పట్టణంలో పలుచోట్ల విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని పలువురు యువకులకు పట్టణ పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇద్దరు మైనర్లు బైకులు నడుతూ పట్టుబడ్డారు. ఆ వాహనాల యజమానులకు ఒక్కొక్కరికి రూ.5035 చొప్పున, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వారికి ఒక్కొక్కరికి రూ.1035 చొప్పున జరిమానాలు విధించారు. ర్యాష్ డ్రైవింగ్,హెల్మెట్ ధరించకుండా బైకులు నడపడం వల్ల వచ్చే అనర్థాలను యువకులకు వివరించారు. రహదారి నిబంధనలు పాటించాలని సూచించారు. వేగం కన్నా ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా ప్రయాణించడం ముఖ్యమని చెప్పారు.


