క్రషింగ్‌ చేపట్టకపోతే ఆందోళన ఉధృతం | - | Sakshi
Sakshi News home page

క్రషింగ్‌ చేపట్టకపోతే ఆందోళన ఉధృతం

Dec 26 2025 8:25 AM | Updated on Dec 26 2025 8:25 AM

క్రషింగ్‌ చేపట్టకపోతే ఆందోళన ఉధృతం

క్రషింగ్‌ చేపట్టకపోతే ఆందోళన ఉధృతం

చోడవరం: ఈ ఏడాది గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ క్రషింగ్‌ ప్రారంభించపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. ఫ్యాక్టరీ మెయిన్‌గేటు వద్ద గురువారం రైతు, కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. ఏపీ చెరకు రైతు సంఘం, వ్యవసాయ కూలీ సంఘం, ఏపీ రైతు సంఘం, సీపీఐ, రైతుకూలీ సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ, ఫ్యాక్టరీ కార్మిక సంఘాలు ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. ఫ్యాక్టరీని కాపాడతామని, చెరకు రైతులకు అండగా నిలుస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చోడవరం, మాడుగుల కూటమి ఎమ్మెల్యేలు, అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు రైతులను పూర్తిగా మోసం చేశారని రైతు సంఘాల నాయకులు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఫ్యాక్టరీకి సాయంగా తీసురాలేకపోయారని వారు ధ్వజమెత్తారు. తమను గెలిపిస్తే ఫ్యాక్టరీని ఆధునికీకరించి, చెరకు రైతులకు టన్నుకి రూ. 4 వేలు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి రైతులు, రైతు కూలీలతో ఓట్లు వేయించుకొని తీరా అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యంగా వదిలేశారన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చలేపోయి, రైతులను మోసంచేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీ వెంటనే రాజీనామా చేయాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేశాయి. లేని పక్షంలో ఫ్యాక్టరీకి ప్రభుత్వ సాయం తెచ్చి రైతుల చెరకు బకాయిలు వెంటనే తీర్చాలని, అదే విధంగా ఈ ఏడాది ఫ్యాక్టరీ క్రషింగ్‌ వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఫ్యాక్టరీని మూసివేసే ఆలోచన చేస్తే రైతులు, కార్మికులు అంతా కలిసి ఐక్యంగా ప్రత్యక్ష ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. చెరకు రైతుల పరిస్థితి ఏంటో ప్రభుత్వం చెప్పాలని, మూసివేసే ఆలోచన విరమించుకుని క్రషింగ్‌ ప్రారంభించాలని రైతులు డిమాండ్‌ చేశారు. కార్మికులకు జీతాలు లేక ఆకలితో కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ఏపీ చెరకు రైతు సంఘం అధ్యక్షుడు కర్రి అప్పారావు, ఏడువాక సత్యారావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, సీపీఎం జిల్లా ప్రతినిధి శ్రీనివాసరావు, రైతు సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ శానాపతి సత్యారావు, మూడెడ్ల శంకర్రావు, సమితి ప్రతినిధులు దండుపాటి తాతారావు, దొడ్డి అప్పారావు, జెర్రిపోతుల నానాజీ, సుగర్‌ ఫ్యాక్టరీ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాయి సూరిబాబు, శరగడం రామునాయుడు, సోమిరెడ్డి నాయుడు, ప్రజా సంఘం ప్రతినిధి వరప్రసాద్‌, వ్యవసాయ కూలీ సంఘం ప్రతినిధి కోన మోహన్‌రావు, సీఐటీయూ నాయకుడు ఎస్వీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement