28 నుంచి నాటకోత్సవాలు
అనకాపల్లి: ఉభయ తెలుగు రాష్ట్రాల నాటకోత్సవాలు స్థానిక జార్జి క్లబ్ ఆవరణలో ఈనెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్షుడు బీఎస్‌ఎంకే జోగినాయుడు తెలిపారు. క్లబ్ ఆవరణలో గురువారం రాత్రి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అంతరించిపోతున్న నాటికలను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గతంలో నాటికలకు అనకాపల్లి జిల్లా పుట్టినిల్లన్నారు. హైదరాబాద్ మహతి క్రియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 28 సాయంత్రం 6 గంటలకు గుంటూరు వారిచే ‘సమయం’నాటిక ప్రదర్శన జరుగుతుందని, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రారంభిస్తారన్నారు. అదేరోజు రాత్రి 8 గంటలకు హైదరాబాద్ మల్లీశ్వరి ఆర్ట్స్ వారిచే ‘నువ్వో సగం–నేనో సగం’నాటిక, 29 సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్, స్వర్ణసూర్య డ్రామా లవర్స్ వారిచే ‘సీ్త్ర మాత్రే నమః’నాటిక, రాత్రి 8 గంటలకు కాకినాడ, బీవీకే క్రియేషన్స్ వారిచే ‘కన్నీటికి విలువెంత’, ఈనెల 30 సాయంత్రం 6 గంటలకు శ్రీకాకుళం శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం వారిచే ‘మాయాజాలం’, రాత్రి 8 గంటలకు పెందుర్తి నటరాజ డ్రమెటిక్ అసోసియేషన్ వారిచే ‘నీళ్లు–నీళ్లు’నాటికల ప్రదర్శనలు ఉంటాయన్నారు. నాటిక ప్రదర్శనల ప్రతిరోజు లక్కీ డిప్ డ్రా ద్వారా ప్రేక్షకులకు బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి బుద్ద కాశీ విశ్వేశ్వరరావు, కోశాధికారి విల్లూరి చంద్రశేఖర్, నాటకోత్సవాల కన్వీనర్ కె.ఎం.నాయుడు, క్లబ్ సభ్యులు డి.రామకోటేశ్వరరావు, కె.బి.ఎం.వెంకటరావు, కాండ్రేగుల వాసు, ఆడారి రమణ, జి.శేషుకుమార్ తదితరులు పాల్గొన్నారు.


