సెస్ చెల్లించని నెయ్యి లారీ నిలిపివేత
బలిఘట్టం మార్కెట్ యార్డు చెక్‌పోస్టు వద్ద నెయ్యి లారీని నిలిపివేసిన మార్కెట్ కమిటి సిబ్బంది
నర్సీపట్నం : వ్యవసాయ మార్కెట్ కమిటీ సెస్ కట్టకుండా తరలిస్తున్న నెయ్యి లారీని బలిఘట్టం చెక్‌పోస్టు వద్ద మార్కెట్ యార్డు సిబ్బంది పట్టుకున్నారు. మార్కెట్ కమిటీకి సెస్ చెల్లించకుండా వ్యాపారస్తులపై ప్రత్యేక దృష్టిసారించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ ఇటీవల సిబ్బందిని ఆదేశించారు. దీంతో ఇటీవల మార్కెట్ కమిటీ సిబ్బంది ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం రాత్రి నర్సీపట్నం నుంచి నెయ్యితో వెళ్తున్న లారీని బలిఘట్టం చెక్‌పోస్టు వద్ద సిబ్బంది పట్టుకున్నారు. సిబ్బంది లారీ వే బిల్లులను పరిశీలించారు. సుమారు రూ.కోటి 27 లక్షల నెయ్యిని తరలిస్తున్నారు. దీని ప్రకారం మార్కెట్ కమిటీకి సెస్ రూపంలో రూ.లక్షా 27 వేలు వ్యాపారి చెల్లించాల్సి ఉంది. సెస్ చెల్లించిన తరువాతే లారీని విడిచి పెడతామని మార్కెట్ కమిటీ సిబ్బంది వ్యాపారికి సూచించారు. వ్యాపారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో చెక్‌పోస్టు వద్దే లారీని నిలిపివేశారు.


