ప్రభుత్వ భూమిపై టీడీపీ నేతల కన్ను
నర్సీపట్నం: మాకవరపాలెం మండలం చినరాచపల్లి వద్ద ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించి యథేచ్ఛగా దుక్కులు చేస్తున్నారు. ప్రభుత్వ భూమి అని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఆ భూమిలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా ఆక్రమణదారులకు పట్టడం లేదు. గ్రామ సమీపంలో ఉన్న ఊటగెడ్డ రిజర్వాయర్‌ను ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో ఆక్రమణదారులు బుధవారం ట్రాక్టర్లతో చదును చేశారు. పట్టపగలు యంత్రాలతో పనులు చేశారు. గతంలో నీరు–చెట్టు పనుల్లో భాగంగా రిజర్వాయర్‌లోని పూడిక మట్టిని తొలగించారు. అయితే ఈ రిజర్వాయర్‌లోకి ఎగువభాగం నుంచి నీరు వచ్చే గెడ్డలను పూడిక మట్టితో కప్పి వేసి ఆక్రమించేందుకు యత్నించారు. ఆ సమయంలో పత్రికల్లో వార్తలు రావడంతో ఈ భూమిలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమి అని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ భూమి ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో హెచ్చరిక బోర్డు ఉండగానే తాజాగా ట్రాక్టర్‌తో ఆక్రమణదారులు దుక్కులు చేసే పనులు చేపట్టారు. ఆక్రమణలను అడ్డుకుని ప్రభుత్వ భూమిని రక్షించాలని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ వెంకటరమణను సంప్రదించగా రిజర్వాయర్ భూమి ఆక్రమణకు సంబంధించి రామన్నపాలెం మాజీ సర్పంచ్ చుక్కా పోతురాజు (టీడీపీ), అడిగర్ల శ్రీనివాసరావు (టీడీపీ)లపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అలాగే దుక్కులు చేస్తున్న ఒక ట్రాక్టర్, అక్కడే ఉన్న ఒక బైకును సీజ్ చేసి పోలీసులకు అప్పగించామన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఎంతటి వారైనా కేసులు తప్పవని హెచ్చరించారు.


