ఎస్పీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు
అనకాపల్లి: లోక రక్షకుడు ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు శుభ పరిణామమని, క్రిస్టియన్ సోదరులు ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. తమ కార్యాలయంలో బుధవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేసి పోలీస్ సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ శాంతి, సంతోషం, త్యాగం, కరుణకు ప్రతీక అని పేర్కొన్నారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, అపారమైన సహనం, క్షమాగుణం వంటి విలువలను క్రీస్తు మానవాళికి అందించారని, వాటిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.దేవ ప్రసాద్, ఆర్‌ఐ మన్మథరావు, ఆఫీస్ సూపరింటెండెంట్ దేవరాజు, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.


