కదం తొక్కిన అంగన్‌వాడీలు
తుమ్మపాల: తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్‌వాడీలు కదం తొక్కారు. వేతనాల పెంపుతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేపట్టారు. గతంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, తదితర నాయకులు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచలేదని, సమస్యలు పరిష్కరించలేదంటూ నినదించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ అనుమతులు లేని ప్రైవేటు ప్రీస్కూళ్లను ప్రోత్సహిస్తున్నారని, అంగన్‌వాడీలను నిర్వీర్యం చేస్తూ యాప్‌ల పని భారం పెంచుతూ కార్యకర్తలపై భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు. కష్టపడుతున్న కార్మికులకు వేతనాలు ఇవ్వడానికి చేతులు రాని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలను ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో లేబర్ కోడ్స్ తీసుకొచ్చి పెట్టుబడిదారులకు ఊడిగం చేయడానికి బీజేపీ, టీడీపీ కూటమి ప్రభుత్వం పన్నాగం పన్నిందన్నారు. లేబర్ కోడ్స్, కార్మిక వ్యతిరేక విధానాలు, అంగన్‌వాడీలకు వేతనాలు పెంపుపై ఈ నెల 31న జరుగుతున్న సీఐటీయూ మహాసభల్లో చర్చించనున్నామని, ఫిబ్రవరి నెలలో దేశవ్యాప్త సమ్మె కూడా సన్నద్ధం అవుతున్నామని తెలిపారు.
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకరరావు, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నాగశేషు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అంగన్‌వాడీలకు నష్టం కలిగించే చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. అంగన్‌వాడీ సెంటర్ల పిల్లలకు తల్లికి వందనం పథకం వర్తింపజేసి, యూనిఫాం, ప్రతి రోజు సాయంత్రం పిల్లలకు స్నాక్స్ ఇవ్వాలన్నారు. వేసవి సెలవుల్లో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ఒకేసారి సెలవులు ఇవ్వాలని, సూపర్‌వైజర్లకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్వో సత్యనారాయణరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పి.దుర్గారాణి, సీఐటీయూ రాష్ట్ర నాయకుడు ఎం.జగ్గునాయుడు, జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి.కుమారి. కోశాధికారి రమణమ్మ, కార్యవర్గ సభ్యులు వరలక్ష్మి, రామలక్ష్మి, సత్యవేణి, మంగ, సామ్రాజ్యం, మహాలక్ష్మి, తనుజ, కృష్ణవేణి పాల్గొన్నారు.


