స్క్రబ్ టైఫస్‌పై ఆందోళన వద్దు
చికిత్స తీసుకోండి
● డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ వీరజ్యోతి
నర్సీపట్నం: స్క్రబ్ టైఫస్‌పై ప్రజలు ఆందోళన చెందవద్దని, వెంటనే చికిత్స తీసుకుంటే తగ్గిపోతుందని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ వీరజ్యోతి తెలిపారు. స్క్రబ్ టైఫస్ ప్రధానంగా నల్లిని పోలిన చిన్న కీటకం కుడితే శరీరంలో బ్యాక్టీరియా పెరిగి స్క్రబ్ టైఫస్‌గా మారుతుందన్నారు. కీటకం కుట్టిన చోట కురుపు మాదిరిగా శరీరం కమిలి పోతుందన్నారు. కొన్ని రోజులకు నల్లని మచ్చతోపాటు దద్దుర్లు ఏర్పడతాయన్నారు. వైరస్ శరీరంలో పెరిగిన రెండురోజులు గడిచిన తర్వాత విపరీతమైన జ్వరం వస్తుందన్నారు. తలనొప్పి, అలసట, వాంతులు ఉంటాయన్నారు. టైఫాయిడ్, మలేరియా మాదిరిగా జ్వరం కనిపిస్తుందన్నారు. సకాలంలో జ్వర లక్షణాలను బట్టి వ్యాధిని గుర్తిస్తే ఐదు రోజుల్లో చికిత్స తీసుకుంటే తగ్గిపోతుందన్నారు.రక్తపరీక్ష చేయటం ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చునని, డాక్టర్ పర్యవేక్షణలో 5 నుండి 7 రోజులు మందులు వాడితే నయమవుతుందన్నారు. వ్యవసాయ భూముల పక్కన నివసించే వారిపై ఎక్కువగా ప్రభావం చూపుతుందన్నారు. ప్రతి పీహెచ్‌సీలో రక్త నమూనాలు సేకరిస్తున్నారన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2 కేసులు నమోదయ్యాయన్నారు. డివిజన్ పరిధిలో ఎలాంటి కేసు నమోదు కాలేదన్నారు. చంటి పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. చల్లనివి తినిపించకూడదన్నారు.
జలుబు, దగ్గు, జ్వరం వచ్చే లక్షణాలుంటే పిల్లలకు దాహం వేసినప్పుడు గోరు వెచ్చని నీటిని మాత్రమే తాగించాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లకుండా సమీపంలోని పీహెచ్‌సీలు కానీ ఏరియా ఆస్పత్రిలో చూపించుకుంటే ఆర్ధిక భారం ఉండదన్నారు.


