18 నుంచి జాతీయ వినియోగదారుల వారోత్సవాలు
తుమ్మపాల: జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 18 నుంచి 24 వరకు వారోత్సవాలు నిర్వహించనున్నట్టు జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్‌వో) వై.సత్యనారాయణరావు తెలిపారు. ఈ మేరకు ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025 సంవత్సరానికి ‘డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ సత్వర పరిష్కారం’అనే థీమ్‌తో వేడుకలను రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ‘డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ సత్వర పరిష్కారం’అంశంపై విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.10 వేలు, రూ.7,500, రూ.5 వేలు నగదు, ప్రశంసా పత్రాలను అందజేస్తామన్నారు. జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.5వేలు, రూ.3 వేలు, రూ. 2 వేలు నగదు, ప్రశంసా పత్రాలను అందజేస్తామని చెప్పారు.


