
పాలిటెక్నిక్‌లో వసతి వెతలు
బాలికలకు వసతి కొరత హాస్టల్ సీట్లు 50.. డిమాండ్ వందల్లో.. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన భవనం నిరుపయోగం దూరప్రాంత డిప్లొమా విద్యార్థినుల అవస్థలు
మురళీనగర్: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో సరైన వసతి సదుపాయం సరిగ్గా లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 9 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో చాలామంది దూరప్రాంతాల నుంచి వచ్చి విద్యాభ్యాసం చేస్తున్నారు. వసతి గృహాలు అందుబాటులోకి రాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బాలికలు వసతి సమస్యను ఎదుర్కొంటున్నారు.
ఉమ్మడి విశాఖలో కంచరపాలెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్, ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్ (గైస్), పెందుర్తి, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, చోడవరం, భీమిలి బాలికలు, పాడేరులో గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో చాలా కాలేజీల్లో హాస్టల్ సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాలోని 9 ప్రభుత్వ కాలేజీల్లో
● భీమిలి మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో బాలికలకు వసతి సదుపాయం ఉంది.
● పాడేరు ప్రభుత్వ ఆదర్శ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్‌లో బాలురకు మాత్రమే హాస్టల్ సదుపాయం ఉంది. నర్సీపట్నంలో హాస్టల్ భవనం ఉన్నా.. కోవిడ్ తర్వాత మూసేశారు. హాస్టల్ నిర్వహణకు ప్రత్యేక సిబ్బంది ఉన్నప్పటికీ దీని నిర్వహణను పట్టించుకోలేదు.
● ఇక అనకాపల్లి, చోడవరం, పెందుర్తి పాలిటెక్నిక్ కళాశాలల్లో వసతిగృహాలే లేవు. దీంతో అక్కడ కాలేజీ దూరప్రాంత విద్యార్థులు చేరినా బయట వసతి వెదుక్కోవాల్సిన పరిస్థితి.
● కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో బాలురకు మాత్రమే స్టూడెంట్స్ మేనేజిమెంట్ హాస్టల్ ఉంది. ఈ హాస్టల్‌లో 350మంది వరకు బాలురకు అవకాశం కల్పిస్తున్నారు.
● విశాఖపట్నంలోని కంచరపాలెం పాలిటెక్నిక్ ప్రాంగణంలో బాలికల కోసం ప్రత్యేకంగా వసతి గృహాన్ని రూ.కోట్లు వెచ్చించి నిర్మించినా అందుబాటులోకి తేవడంలో సాంకేతిక విద్యాశాఖ విఫలమైంది. ఈ కాలేజీలో 500మందికి పైగా బాలికలు చదువుతున్నారు. పాలిటెక్నిక్‌లో 100మంది వరకు వసతి కల్పించే విధంగా భవనం నిర్మించినా ఏళ్ల తరబడి నిరుపయోగంగానే ఉంది.
● ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్ (గైస్)లో వుమెన్స్ హాస్టల్‌ను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ చదలవాడ నాగరాణి ఆదేశాల మేరకు ప్రారంభించారు. ఇక్కడ 50 మంది విద్యార్థులకు వసతి కల్పించారు. అయితే, ఇక్కడ ప్రత్యేక సిబ్బంది లేకపోవడంతో విద్యార్థినులకు రక్షణగా కాలేజీ సిబ్బందిని వినియోగిస్తున్నారు. వీరికి సమీపంలోని పాలిటెక్నిక్ బాలుర హాస్టల్ నుంచి భోజనాలు తీసుకువస్తున్నారు. భోజనాలు తీసుకురావడానికి ఆటో చార్జీలను విద్యార్థులే భరిస్తున్నారు. ‘గైస్’ కాలేజీ హాస్టల్‌కు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి ఇక్కడే భోజనం వండి అందించే ఏర్పాట్లు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
పెరుగుతున్న డిమాండ్
డిమాండ్‌కు తగిన విధంగా హాస్టల్ సీట్లు లేవు. గైస్‌లో నాలుగు కెమికల్ ఇంజినీరింగ్ బ్రాంచీల్లో ఏయూ రీజియన్‌తో పాటు ఎస్‌వీ యూనివర్సిటీ రీజియన్‌కు ప్రత్యేకంగా కొన్ని సీట్ల రిజర్వేషన్ ఉంటుంది. దీంతో ఎస్వీయూ పరిధి జిల్లాల నుంచి బాలికలు ఎక్కువగా ఈ కళాశాలలో చేరుతున్నారు. పాలిటెక్నిక్ కాలేజీలోనూ ఎస్వీయూ పరిధిలోని విద్యార్థులు చేరారు. దీంతో వీరు కాలేజీ హాస్టల్‌లోనే ఉండాలని అభిలషిస్తున్నారు. గైస్ హాస్టల్‌లో కేవలం 50 సీట్లు మాత్రమే ఉన్నాయి. డిమాండ్ వంద మందికి పైగా ఉంది. పాలిటెక్నిక్ కాలేజీ బాలికలకు కూడా ఇక్కడ వసతి కల్పిస్తున్నారు. దీని వల్ల ఇతర దూర ప్రాంత జిల్లాల బాలికలకు వసతి కల్పించలేకపోతున్నారు. ముఖ్యంగా ఫస్టియర్ విద్యార్థులకు వసతి కొరత ఉంది. కంచరపాలెం పాలిటెక్నిక్ ప్రాంగణంలో నిర్మించిన భవనాన్ని అందుబాటులోకి తీసుకువస్తే సుమారు వందమందికి వసతి కల్పించేందుకు అవకాశం ఉంటుంది. విద్యార్థినులకు వసతి సమస్య తీరుతుంది. ఆ దిశగా సాంకేతిక విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పాలిటెక్నిక్‌లో వసతి వెతలు

పాలిటెక్నిక్‌లో వసతి వెతలు